ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

తిమ్మరుసు మంత్రి


నియోగింపఁబడియెను. ఇతఁడు నందవరీక నియోగిబ్రాహ్మణుఁడు. మొదట కొప్పోలు గ్రామమునకుఁ గరణముగా నుండి కవీశ్వరదిగ్ధంతి యను ప్రతిష్ఠ గలవాఁడై చదరంగపుటెత్తులు వేయుటయం దసమానప్రజ్ఞాఢ్యుడుగ నుండెనఁట. ఈబొడ్డుచర్ల తిమ్మకవీంద్రుఁడు తిమ్మరుసుమంత్రి ప్రాఫునఁ గృష్ణదేవరాయని ప్రేమమున కాస్పదుఁ డయ్యెను. శ్రీకృష్ణదేవరాయని పక్షమున నెంద ఱాలోచించి యెత్తు వేయుచున్నను నీతఁ డొక్కఁడే యెదురెత్తువేసి యాట గెల్చుచు వేయార్లు పందెము గొనుచుండెడివాఁడని యీక్రింది పద్యమువలనఁ దేటపడఁగలదు.

"క. శతసంఖ్యు లొక్కటైనను
    సతతము శ్రీకృష్ణరాయజగతీపతితోఁ
    జతురంగ మాడి గెల్చును
    ధృతిమంతుఁడు బొడ్డుచర్లతిమ్మనబళిరే."

"ఉ. ధీరుఁడు బొడ్డుచర్ల చినతిమ్మనమంత్రి కుమారు డంచితా
     కారుఁడు సత్కళావిదుఁడు కౌశికగోత్రుఁడు పద్మనేత్ర సే
     వారతబుద్ధి నందవరవంశ్యుఁడు సత్కవిలోకనాథుఁ డా
     చారసమగ్రవర్తనుఁడు చారవచస్థ్సితి నొప్పువాఁ డొగిన్."

ఇతని శక్తిచాతుర్యములకు సంతోషించి కృష్ణదేవరాయఁడు కొప్పోలు గ్రామమునకు కృష్ణరాయవుర మని పేరిడి సర్వాగ్రహారముగా నీతనికి ధారపోసెను. శ్రీకృష్ణదేవరాయఁడు క్రీ. శ. 1509 వ సంవత్సరము మొదలుకొని 1512 వ సంవత్సరమువఱకు విద్యావినోదగోష్ఠియందే కాలము గడపెను.