ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

అరసున్న

తెలుఁగుభాషకుఁ దోడిభాషలగు ద్రవిడ కర్ణాటకములందుఁగాని, ప్రకృతులగు సంస్కృత ప్రాకృత భాషలందుఁగాని యరసున్న లేదుగదా! అట్టిచో నిది తెలుఁగున నెప్పుడు పుట్టినది? ఎట్లు పుట్టినది? భాషా లక్షణములను బరిశీలించుచుఁ బూర్వపూర్వకాలమునకుఁ బోనుపోను ద్రవిడ కర్ణాటాంధ్ర భాషల భేదము తక్కువతక్కువై మూఁడు నొక్కటిగానే యున్న కాలముగూడ నొకప్పు డుండుటను మనము గుర్తింపఁగలము. నన్నయకుఁ బూర్వకాలమున నీ యరసున్న యున్న దనుట కాధారము నాకుఁ గానరాకున్నది. నన్నయాదుల నాళ్ళనుండియే యరసున్న వెలయఁ జొచ్చినట్టు వారి గ్రంథములఁబట్టి గుర్తింప నగుచున్నది. సహజముగా బదమందున్న యొక యక్షరమునకో, కొన్ని యక్షరములతో ఆదేశమై వచ్చినదిగాని నాసిక్యహల్లు ఇతరహల్లుతో సంయుక్త మయినప్పు డేర్పడిన హల్ ద్విత్వము శిథిలము కాఁగా నందలి శిథిలానునాసికమే యరసున్నగా నన్నయాదుల కాలము నుండి మాటె నని చెప్పఁడగును. దీని కించుక వివృతి.


ద్రవిడ కర్ణాటభాషలలో సంయుక్తహల్లులు పూర్వాక్షరమునకు గురుత్వమును గల్పింపకుండఁ బెక్కులు గలవు. అట్టివానిలో పెక్కింటి ద్విత్వము తెలుఁగుఁదనము వేరుడి యేర్పడిననాఁటికి మాసిపోయినది. తెగఱ్గుం, నెగఱ్గుం ఇత్యాదులు తెగడున్, నెగడున్ ఇత్యాది రూపములు బడసినవి. హల్ ద్విత్వములో ద్వితీయ హల్లు లోపించినప్పు డిట్టి రూపము లేర్పడినవి. మొదటిహల్లు లోపింపఁగా నేఁటి మన యరసున్న యైనది. మెఱుమ్ మెఱుపు. దీనిమీఁద బహువచన ప్రత్యయమగు 'కళ్' గలయఁగా