ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓం నమో వేంకటేశాయ


ముందుమాట 27.01.2008, భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షులు తి.తి.దేవస్థానపాలకమండలి, తిరుపతి.


తిరుమల తిరుపతి దేవస్థానాలు చేపట్టి, పురోగమిస్తున్న అనేక సామాజిక, సాహిత్య, తాత్త్విక, భక్తి, ధార్మిక ప్రచార కార్యక్రమాలు ప్రజల్లో నూతనోత్తేజాన్ని పెంపొందింప జేస్తున్నాయి. ఈ మార్గంలో రామాయణ భారత భాగవతాది గ్రంథాల్ని వివరణాత్మకంగా సొమాన్య ప్రజలకు సైతం అర్థమయి, అందుబాటులో ఉండేవిధంగా ప్రచురిస్తున్నాము,


అన్నమయ్య, వెంగమాంబ సాహిత్యాన్ని విశేషంగా ప్రజలవద్దకు తీసుకువెళ్లేందుకు శతథా కృషి చేస్తున్నాము. ప్రాచీన సాహిత్యంలో, నవీన సాహిత్యంలో ధార్మికాంశాలు విశేషంగా ఉన్నవాటిల్ని నేరుగానూ, ఆర్థిక సహాయం అందించడం ద్వారానూ ప్రచురిస్తున్నాము.


ఈ మధ్య "శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠాన్ని' శ్వేతలో నెలకొల్పి, శ్రీప్రభాకరశాస్త్రిగారి సాహిత్యాన్నీ, అన్నమయ్య కీర్తనల పరిశోధనలో వారుగావించిన కృషినీ, సహృదయ సమాజం చిరకాలం గుర్తుంచుకొనేట్టుగా కార్యక్రమాలు రూపొందించి, నిర్వహిస్తున్నాము. శ్రీప్రభాకరశాస్త్రిగారు సంస్కృతాంధ్రాల్లో గొప్పపండితులు. తెలుగులో అనేకాంశాలపై ఎంతో పరిశోధించి, అనేక నూతనాంశాలు వెల్వరించారు.