ఈ పుట ఆమోదించబడ్డది


2

ఆంధ్ర భాషావతారము

అఖండస్ఫోటమై వెలయు శబ్దబ్రహ్మము ధ్వనితాదాత్మ్యాధ్యాసచే నానాదేశములందు, నానాజాతిజనులందు బహుభాషలుగా, బహ్వర్దములతో బరీస్ఫురించుచున్నది. ఆకసముననుండి మేఘ మతినిర్మల మైనయంబువును వర్షింపఁగా నదియుప్పుబఱ్ఱలందు, రేవడిచెలికలందు, మహౌషధీమయము లగు నరణ్యములందు, రసధాతుభరితములగు పర్వతములందును బడి తతాదాత్మ్యముతో భిన్నరూపములను, భిన్నరుచులను బొందుచు జాలువాటి కోల్లై, సెలయేళ్లై, వంకలై, వాగులై, నదులై, మహానదులై ప్రబలములైన భేదముల బడయుచున్నది. భాషల పుట్టుపూర్వోత్తరములుగూడ నిట్టీవే.

సహ్యపర్వతమునఁ దొలుత జాలువాఱుటలో సమానలక్షణములు గలవై యున్నను కృష్ణా కావేరీనదులు ఆంధ్రదేశమునకును, అఱవ దేశమునకును సాగను సాగను విభిన్న లక్షణముల వెలసి వెలసి వేఱువేఱు తీరులను, పేరులను బడసినట్లుగా ఆంధ్ర ద్రవిడ కర్ణాట భాషలు తొలుత (ఆంధ్రద్రవిడకర్ణాటు లని నేఁడు విభిన్నులుగా నున్నవా రొకప్పు డొక్క చోట నొక్క సంఘముగా నుండి వెడలి వేఱుపడినవారే యని నానమ్మకము.) నొక్కటిగానే యుండి కాలక్రమమున భిన్నభిన్నదేశములఁ జెంది భిన్నత్వములం బడసినవి. ఆంధ్రద్రవిడకర్ణాటకభాషల నేఁటిస్వరూపము లెంత భిన్నములుగా నున్నను, పూర్వపూర్వముసు బరిశోధించుచుఁ బోవనుబోవను వాని భేదములును దక్కువ తక్కువ లగుచుండుట తెలియనగును. ఇట్లు చూడఁగా రెండువేలయేండ్లకుఁ బూర్వ మీ భాషల పృధగ్భావము విస్పష్టలక్షణము లతో వెలసియుండకపోవుట గోచరించును.