పుట:Telugu bala Satakam PDF File.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

79. జన్మదినము బాగ జరుపుకొనెడు వేళ
పసలు లేని ఖర్చు వదలి వైచి
పేద సాదాలకిడ 'పెను పుణ్య'మబ్బును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

80. తల్లిదండ్రులెపు డు పిల్లలన్‌పెంచుచు
విద్య నేర్ప వలయు ప్రేమచూపి
విద్య నేర్పకుండు పితరులు శత్రువుల్‌
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

81. చిత్రలేఖనమున చిత్తమ్ము గమియింప
శ్రద్ధ చూపి నేర్వ బుద్ధి పెరుగు
చిన్ననాటి శ్రద్ధ సత్కీర్తి సమకూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

82. చదువు గుణముతోడ చక్క గా వినుబుద్ధి
కలిగియుండవలయు గట్టిగాను
ఇట్టి గుణములెల్ల హెచ్చించు ప్రతిభను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

83. త్యాగ ధనుల గూర్చి యోగజీవుల గూర్చి
తెలిసి కొన్న యపుడు తెలివి పెరుగు
అట్టి వారి గుణము లాశీస్సులైయుండు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

84. ఇంటిలోని చెత్త వెంట దీసుకుపోయి
వీధిలోన నెపుడు విడువరాదు
శుభ్ర పరిసరాలు సుఖములు చేకూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.



20 తెలుగు బాల శతకం