పుట:Telugu bala Satakam PDF File.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

73. మంచి వాడు సతము మాటాడు మెత్తగా
వదరుబోతులెపుడు వాగుచుంద్రు
ఏమిలేని ఆకు ఎగిరిపడుచునుండు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

74. అవసరమ్ముతోడ నలమటించుచునుండ
దానమొనరచేయ ధర్మ మగును
పాత్ర నెరిగి దాన భావమ్ము చూపుము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

75. సాిటి వారి గూర్చి చాడీలు చెప్పంగ
స్నేహ భావమునకు చేటు కలుగు
చాడిచప్పు బుద్ధి చంపుట యుక్తమ్ము
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

76. పెద్ద వారి పట్ల వినయమ్ము చూపంగ
బలము పెరుగుచుండు బాగుగాను
అధిక కీర్తి గలుగు నాయువు వర్ధిల్లు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

77. నిందలేని యట్టి నిజమైన మనుగడ
కోరు కొనగ వలయు కూర్మితోడ
ఒక్క నిందయైన నొన గూర్చునప కీర్తి
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

78. అతిథి దేవుడనెడి ఆర్యోక్తి గమనించి
ఆదరించ వలయు నతిథినెపుడు
అతిథి తృప్తితోడ నరుగుచుండ వలయు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


                                                     తెలుగు బాల శతకం 19