పుట:Telugu bala Satakam PDF File.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

19. చీమ లెల్ల చెక్కు చెదరక పంక్తిలో
నడచునట్టి తీరు నరసినపుడు
క్రమము తప్ప కుండ గమియింప వలెనంచు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

20. తెలివిగలిగినంత తేజమ్ము కలుగదు
ఉన్న తెలివి వృద్ధి నొందుటకును
సాధనమ్ము వలయు చదువులందెప్పుడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

21. మాటలందు వినయ మాధుర్యములు నింపి
మాటలాడినపుడు మన్ననగును
నోరుమంచిదైన ఊరుమంచిదగును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

22. తల్లి బాస నెఱిగి యెల్ల బాసలు నేర్వ
ప్రతిభ పదునుదేరు బాగుగాను
ఇంట గెలిచిరచ్చ కక్కుట మేలౌను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

23. చదువు మీద శ్రద్ధ చక్క గా చూపింప
మేధా పెరుగుచుండు మేటిగాను
చదువు కీర్తి నిచ్చు సౌభాగ్యమొసగును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

24. ఆంధ్రులకును సొత్తు అష్టావధానమ్ము
అక్షరముల తోడి ఆటయగుచు
సంత సింపచేయు సాహితీ ప్రియులను
తెలిసి మెలగ మేలు తెలుగు బాల

_______________________________________________

    10                                                                                                                                                                                                                తెలుగు బాల శతక౦