కొయ్యకాళ్ళ మనుషులు
ఆంధ్ర దేశంలో ఉత్సవాల్లో, జాతర్లలో, పెళ్ళిళ్ళలో బుట్ట బొమ్మల ప్రదర్శన చూస్తూనే వున్నాం. అదే మాదిరి కాళ్ళకు కొయ్యలు కట్టుకుని అందిరి కంటే ఎత్తుగా కనిపిస్తూ ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉత్సవ సమయాల్లో నృత్యం చేస్తూ వుంటారు.
తేలికగా వుండే గట్టి కొయ్యలతో కాలికి అమర్చే కొయ్యలను తయారుచేస్తారు. అవి నాలుగడుగులు పొడుగుంటాయి. వాటిని పాదాలకు అమర్చి, గట్టిగా కట్టుకొని మరిక కర్ర సహాయంతో కొంచెం దూరం నడుస్తూ అలాగే నృత్యం ప్రారంభించి ఎవరి సహాయం లేకుండానే తప్పెటల వాయిద్యానికి అనుకూలంగా అడుగులేస్తూ అభినయిస్తారు. ఇలా నృత్యం చేయడానికి నైపుణ్యం కావాలి. కొయ్యకాళ్లతో నృత్యం చేస్తూనే కొన్ని విన్యాసాలు చసి ప్రేక్షకుల్ని రంజింప చేస్తారు.
అలాగే కొంత మంది లంబాడీలు, ఎరుక సానులూ, కొన్ని కొయ్య బొమ్మలను తయారు చేసి, చేతులతో ఆడిస్తూ, ఆ బొమ్మలకు శృంగారాన్ని కలిగిస్తూ రెండు బొమ్మల మధ్యా కలహాన్ని రేపెడుతూ చమత్కారంగా ఆడిస్తారు. ఇలాంటి ఆటలన్నీ ఒక నాటి జానపదుల్ని ఎంతగానో అలరించాయి. ఈనాడివి చాల అరుదుగా వున్నాయి.
తెర చీరలవారు
ఆంధ్రదేశంలో తెర చీరలవారని ఒక జాతివారున్నారు. వారి గోత్రాలనూ, వారి పూర్వవృత్తాంతాలను, గాధలనూ చెపుతూ వుంటారు. వీరు సుద్దులను కూడ చెపుతారు.
పై విధానపు తెర బొమ్మల గురించి క్రీడాభిరామంలో ఒక పడతి పల్నాటి వీరచరిత్రను గూర్చి పాడుతూ వున్నదనీ, అక్కడ వారి చరిత్ర ఒక చిత్రఫలకం మీద వ్రాయబడెననీ, దానిని గూర్చి ఈ క్రింది విధంగా వర్ణింపబడింది.
కోల దానపు ద్రిక్కటి కూడి యున్న
గచ్చు వేసిన చిత్రంపు గద్దె పలక
వ్రాసినారదె చూడరా వైశ్యరాజ
శీల బ్రహ్మాది వీర నాసీర చరిత.
- (క్రీడాభిరామం 125)