పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/739

ఈ పుట ఆమోదించబడ్డది

జానపదుల జ్యోతి నృత్యం

రాయలసీమలో తొగట వంశస్థులు భక్తితో తయారు చేసిన జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని చౌడమ్మ దేవతను వర్ణించే పాటల కనుగుణంగా చేసే నృత్యం. ఈ నృత్యాన్ని, పల్లెల్లో 'జ్యోతుల బోనాలు ' అని అంటారు. ఈ నృత్యాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే కులవృత్తిపరంగా చేస్తుంటారు. నేసే కులస్థులంతా ఏకమై నృత్యం చేస్తూ తృణమో పణమో వసూలు చేస్తారు. (తొగట వంశస్థులే, నేసే కులస్థులు. ఈ నృత్యానికి కంచుతో చేసిన తాళాలు, చేతులు చప్పట్లు వుంటాయి. వీటి కనుగుణంగా పాట ననుసరించి తాళ గతిని మార్పు చేస్తూ వుంటారు. పాటలన్నీ శివునిపైనా, చౌడమ్మపైనా వుంటాయి.

జ్యోతిని ఇలా తయారు చేస్తారు:

ఊరు బయట స్థలంలో ఆవు పేడతో అలికి ఒకరు స్నానం చేసి, ఉపవాసం చేసి జ్యోతిని తయారు చేస్తారు. గోధుమ పిండిని ముద్దగా కలిపి మధ్యలో ఒక కొత్త గుడ్డను మైనపు వత్తిలా తయారుచేస్తారు. రతి పోసిన తరువాత జ్యోతిని దానిపై వుంచి పూజ చేస్తారు.

కాళ్ళకు గజ్జలు కట్టుకుని, ఎర్రటి గుడ్డను నడుముకు అడ్డగుడ్డలా కట్టుకుంటారు. మొడలో కొన్ని హారాలు వేస్తారు. నుదుట బండారుబొట్టు పెట్టుకుంటారు. అలా జ్యోతిని ఎత్తుకుని వుండగా ఆ జ్యోతి చుట్టూ గుండ్రాకారంగా జనమంతా నిలబడతారు. వీరిలో కొద్ది మంది తాళాలు పట్టుకొని వుంటారు. అందరూ గుండ్రాకారంగా తిరుగుతూ పాటలు పాడతారు.ఒకరు పాడుతూ వుండగా మిగిలిన వారంతా వంత పాడతారు. జ్యోతి నెత్తుకున్న వ్వక్తి పాట కనుగుణంగా అడుగులు వేస్తుంటాడు. జ్యోతులు రెండు మూడు కూడ వుంటాయి. నడి బజార్లో జ్యోతి నృత్యం జరుగుతూ వుండగా, ఆ జ్యోతికి బలిని ఇస్తూ వుంటారు.

గణపతి ప్రార్థన:

ఒకరు జ్యోతిని ఎత్తుకుని నట్టనడుమ నిలబడి పాట కనుగుణంగా, చుట్టూ గుండ్రాకారంగా నిలబడి వున్నవారంతా అడుగులు మారుస్తూ తిరుగుతూ వుండగా గణపతి ప్రార్థన ప్రారంభమౌతుంది.