పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/70

ఈ పుట ఆమోదించబడ్డది

ఇండ్లలో వేదాల్లాగా వల్లించే వారట. శిరియాళచరిత్రను గురించి బసవ పురాణంలో__

కరమర్థి నూరూర శిరియాలు చరిత - పాటలుగా గట్టి పాడెడు వారు
అటుగాక సాంగభాషాంగ క్రియాంగ - పటునాటకంబుల నటియించువారు

శిరియాలు చరితను పాటలుగా గట్టి పాడటమే గాక, ఆ కాలంలో నాటక ప్రదర్శనాలు కూడ జరిగినట్లు పై ఉదాహరణల వల్ల తెలుస్తూ వుంది.

పండితారాధ్య చరిత్రలో ప్రజాకళారూపాలు:

ఆ నాటి తెలుగు రచనల్లో కేవలం సూచనలే గాక, నృత్యకళకు సంబంధించిన అనేక వర్ణనలు మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర పర్వతప్రకరణంలో నృత్య కళకు సంబంధించిన అనేక శాస్త్రీయ విషయాలనే గాక జాయప నృత్తరత్నావళిలో వర్ణించినట్లు జానపద నృత్యాలను కూడ వర్ణించాడు.

ఈ గ్రంథంలో సోమనాథుడు శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలలో ప్రదర్శించే కళా రూపాల నన్నింటిని ఉదాహరించాడు. నృత్య కళకు, శైవ మతానికి పరస్పర సంబంధ మున్నట్లు కనబడుతూ వుంది. ప్రజాను రంజాకాలుగా వున్న ఆనాటి దేశీ నృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను గూర్చి, దేశీ నాటక సంప్రదాయలను గూర్చి పండితారాధ్యచరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.

ఎన్నో ఆటలు - ఎన్నో నాటకాలు బహు నాటకములు:

ప్రమథపురాతన వటిచరిత్రములు-గ్రమమొంద బహునాటకము లాడు వారు
లలితాంగ రసకళాలంకారరేఖ - లలవడ బహురూప మాడెడువారు
గరణముల్, మొరవణుల్ గతులు జిత్రములు - నరుదుగ వెడ్డంగ మాడెడు వారు.

ఆటలు:

అమరాంగనలు దివినాడెడు మాడ్కి -- సమరంగ గడలపైనాడెడు వారు
నావియద్గతి బక్షులాడెడునట్టి -- భానన మ్రోకులపై నాడు వారు.