పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/687

ఈ పుట ఆమోదించబడ్డది

వాద్య కారుడు తప్పెటలను వాయిస్తూనే నీరు నిండిన కుండను నెత్తిన పెట్టుకుని నీరు తొణక కుండా, ఒక ప్రక్క తప్పెట వాయిస్తూ నీరు తొణికి పోతాయేమో అనే దృష్టి లేకుండా నృత్యం చేస్తూ వుంటే చుట్టూ చేరిన జనసందోహం చప్పట్లు చరుస్తారు.

గంగమ్మ కథ:

యాదవులైన తప్పెట గుళ్ళ కళాకారులు ముఖ్యంగా చెప్పే కథ... గంగమ్మ కథ... గంగమ్మను వారు ఆరాధ్య కులదేవతగా ఆరాధిస్తారు. కాటమరాజు భార్య గంగమ్మ అనీ, శివుని ఆజ్ఞ ననుసరించి,పార్వతీ దేవే గంగమ్మగా అవతరించిందని యాదవుల నమ్మకం. అంతే కాదు అందరికీ అన్ని వాయిద్యాలనూ దానం చేసిన శంకరుడు తన వద్ద మిగిలి వున్న తప్పెటగుళ్ళను యాదవుల కిచ్చినట్లు ఇతిహాసం. గంగమ్మ పట్ల వీరు ఎటువంటి భక్తి శ్రద్ధలను కలిగి వుంటారో, గంగమ్మ తిరునాళ్ళలో పాడుకునే ఈ పాటను తిలకిస్తే బోధపడుతుంది.

శోభనమో యమ్మ - శోభనమే తల్లి
శోభనమో గంగ - శోభనమో తల్లి
మూడు మూళ్ళ నరులమే - మురికి జన్మం మాది
ఎంగిలి కంఠాన మేమెంచి - పిలువంగ లేము
పాచి నోరుతోను - పాలింపలేమో యమ్మ
నీకు వందనమమ్మ లోకమాతవు నీవు
దబ్బ వనములోన - దాగుండి నావు తల్లీ
నిమ్మ వనములోన - నిలిచి వున్నావు తల్లీ
నీకు వందన మమ్మ - లోక మాతవు నీవు.

అంటూ గంగమ్మ దేవుని ప్రార్థిస్తూ కథను సాగిస్తారు.

ముఖాలు పైకెత్తి, నివ్వెరపడి అలాగే ఆశ్చర్యంతో చూస్తూ వుంటారు. అది ఎంతటి అద్భుత ప్రదర్శనమో మనం ఊహించుకోవచ్చును.

ఈ ప్రదర్శనం ఎంతో కట్టుబాటుతో క్రమ శిక్షణతో నడుస్తుంది. ఒక ధ్యేయంతో, లక్ష్యంతో నడుస్తుంది. ఎంతో భక్తి భావంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రదర్శనాన్ని సాగిస్తారు. వారి ప్రదర్శన వరుస క్రమంలో ఏ మాత్రం పొరపాటూ జరిగినా అవమానంగా భావిస్తారు. అందువల్లే వారి ప్రదర్శనం ప్రారంభం నుండీ అసాంతం వరకూ, ఎంతో ఆసక్తికరంగా నడుస్తుంది.