పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/685

ఈ పుట ఆమోదించబడ్డది
తప్పెట గుళ్ళు:

నాడు అశేష ఆంధ్ర ప్రజాసామాన్యాన్ని ఉర్రూతలూగించిన వారి ఉత్సాహ ఉద్వేగాలతో, ఉద్రేకపరచి ఆనంద డోలికలలో ఊగులాడించిన రాజాధిరాజులతో పాటు సామాన్య ప్రజలను మెప్పించి, వారి మన్ననలు పొంది, రంగ రంగ వైభోగంగా వారి జీవితాలలో జీవించి, వారి వారి జీవితాలను తీర్చి దిద్దిన నాటి జానపద కళారూపాలతో పాటు "తప్పెటగుళ్ళు" అనే విశిష్ట సంగీత నృత్య కళా రూపం ఈ నాడు అక్కడక్కడా కనిపిస్తూ కొనవూపిరితో కొట్టు కుంటూ దిక్కూ తెన్నూ లేక ఆదరణ కోసం ఎదురుచూస్తూ వుంది.

కళింగ కళారూపమిది:

తప్పెట గుళ్ళు అనఏ ఒక కళారూపం వుందని, ఈ నాటి తెలుగు వారికి తొంబై మందికి తెలియదంటే ఎవరూ ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. అది ఒక విశిష్ట కళా రూపం, అది ఆ నాటి కళింగాంధ్ర దేశంలో ఉత్తమ కళారూపంగా వెలుగొందిన జానపద కళారూపం. అది ఈనాడు కను మరుగై పోతూ వుంది. ఈనాడు ఉత్తరాంధ్ర దేశంలో పల్లెటూళ్ళలో పల్లె ప్రజలు పోషణతో సంరక్షింప బడుతూ వుంది. ప్రతి ఏటా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్లలోనూ పండుగ దినాల్లోనూ ఉత్సాహంగా ప్రదర్శింపబడుతూ వుంది.

తప్పెటగుళ్ళు జానపద సంగీత నాట్య దృశ్య రూపకం, రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెటలాంటి ఒక వాయిద్య పరికరాన్ని రొమ్ములపై కట్టుకుని రెండు చేతులతోనూ వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధమైన రంగుల నిక్కర్లను తొడిగి, కేకలతో రూపాలతో కేరింతాలు కొడుతూ, ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ కట్టుదిట్తమైన శాస్త్రీయమైన అడుగులతో అందరూ వంగుతూ, లేస్తూ, గెంతుతూ, సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ మృదు మధుర మైన సంగీతంతో మధురంగా పాటలు పాడుతూ ప్రేక్షకులను రంజింప చేస్తారు.

జట్టు నాయకుడే గురువు:

తప్పెట గుళ్ళు బృందానికి ఒక నాయకుడు వుంటాడు. అతనే ఆ బృందానికి గురువు. నాయకుని చెప్పు చేతల్లో ప్రదర్శనం సాగుతుంది. కేవలం తప్పెట గుళ్ళతో నృత్యం చెయ్యటం మాత్రమే కాక నాయకుడు, రామాయణం, భారతం బొబ్బిలి