పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/681

ఈ పుట ఆమోదించబడ్డది

కూసుంటాది. బొఱ్ఱ కలుగుతది_ బొజ్జెదుగతది. గాజు లొస్తవీ, ఘలు ఘలు మంటవి. మేలు మేలౌతది రాజా మేలౌతది. జననీ.

మనసులో వున్న మాటలు చెప్పడం:

జగఝ్ఘాంతాళీ_ మళయాల భగవతీ! ధాతావతీ! యక్షిణీ! పరంజ్యోతీ పల్కు_ అంబా పల్కు _ దేవీ పల్కు, జగదాంబా పల్కు, శాంకరీ పల్కు _ ఓం కారీ పల్కు _ మహంకాళీ పల్కు, నాలుక యందు సరస్వతీ పల్కు, భేతాళా పల్కు, పల్కు, నా యిష్ట దేవతా పల్కు.

అద్గది గద్గదిగో దేవరో అయ్యగారు మీసం మెలేస్తండు. రోసంబు చేస్తండు _ సురసురా చూస్తడు. అయ్యగారు మనసులో ఒక చక్కటి కార్యం తల పెట్టిండు అది అగునా కాదా? అని తన మనసున తానే బహు తొక్కిసలాడ్తుండడు.

హద్గదే అయ్యగారి మనసులోని కార్యం సెప్పుడకు బ్రామ్మడైతే ప్రశ్న సెపుతడు. జ్యోతిష్య మతమును బట్టి సెపుతడు. అది ఔటా? కాక పోవుటా? జంగము దేవర ప్రశ్న చెపుతడు. బసవ శంకరుని వేడి సెపుతడు. అదీ అవుటా? కాక పోవుటా? ఎరుకలవాడు ప్రశ్న చెబుతడు. కొల్లాపుర దేవతను వేడి సెపుతడు. అది ఔటా కాక పోవుటా, సోదెమ్మ సోది చెబుతది అది ఔటా? కాక పోవుటా?

అంటూ దొరో ఈ బుడబుక్కల రామ జోగి ప్రశ్న చెపుతడు, బుడబుక్కల రామ జోగి ప్రశ్న చెబితే ఘనంగా వుండాలి దేవరో; మహద్దేవర మతంగా వుండాలి. మహద్దేవర మతమంటే? ఇను దేవరో!

గడబిడ జరగ బోతది:

ఈ గ్రామలో కొద్దిలోపల గొప్ప గడబిడ పుట్ట బోతుండది. అది ఎటువంటి గడబిడ అని అడగ బోతరు. ఊరికి ఉత్తరంగ పెద్ద వూడల మఱ్ఱి వుండాది. దాని మీద కూర్చున్న జోడు పచ్చులు ఏమని పల్కుతున్న వంటే, ఒక తాటి కమ్మల గుడిసెలో తొంబై తొమ్మిదేళ్ళ కన్నె పడుచు గడ గడా వణికి తెల్లారే సరికి తొలి సమర్తాడేవంతుండది దేవరో, అందు మీద ఈ గ్రామంలో ఇకల్పములు పుడతై. రాచ విడ్డూరములు పుడతై. అన్యోన్య కలహంబులు పుడతై. కీడుని ఎల్లగొట్టి, మేలును తెచ్చే ఈ రామ జోగి పేరు సెబితే? అంత లోనే అణగి పోతై దేవరో!

అంటూ ఇలా తన పాండిత్యాన్నంతా చెప్పి, అయ్యగారిలో ఆలోచనలు రేకెత్తించి నమ్మకం కలిగిస్తాడు.