పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/668

ఈ పుట ఆమోదించబడ్డది
పామర కళారూపమా?:

ఇలాంటి శాస్త్రీయ జానపద కళారూపాన్ని శాస్త్రీయ నృత్యకారులు పల్లెటూరి కళారూపంగా పామర కళారూపంగా ఏదో పని లేక తీరిక సమయాల్లో ఉవుసు పోక కుఱ్ఱవాళ్ళందరూ కలిసి చేసుకునే ఏదో చెక్కభజనగా తేలిక భావంతో చూసి ఇలాంటి కళారూపాలన్నిటినీ అణగద్రొక్కి వేశారు.

చెక్క భజనలో తాళం లేదా? లయ లేదా, గమకం లేదా, పాట లేదా? అంగికాభినయ విన్యాసంతో కూడిన నృత్యం లేదా? అభినయంతో కూడిన ముఖభావాలు లేవా? భక్తి పాటల తన్మయత్వంలో ముఖంలో చూపించే సాత్వికాభావాలు లేవా? అందరికీ అర్థమయ్యే భాష లేదా? ముఖంలో సాత్విక భావం లేదా? చిరుగజ్జెల సవ్వడితో చేసే నృత్యం లేదా? అందరు ఒకే రకంగా తిరుగుతూ, కూర్చుంటూ, లేస్తూ గిరకాలు కొడుతూ క్రమ శిక్షణతో కూడిన శాస్త్రీయమైన తాళ గతులు లేవా? స్వర గతులు లేవా? బృందాన్నంతా ఏక త్రాటి మీద నడిపే గురువు లేడా? ప్రేక్షకులందర్నీ ముగ్ధులను చేస్తూ పాటలు పాడే శ్రావ్వమైన కంఠాలు లేవా? ఎన్నో వున్నాయి. అల్లుడు నోట్లో శని అన్నట్లు ఆదరణ తగ్గి పోయింది. అయినా పల్లె ప్రజలు ఈనాటికీ ఈ కళారూపాన్ని బ్రతికించు కుంటున్నారు. ఈనాటికీ అన్ని ప్రదేశాల్లోనూ ఈ కళారూపం బ్రతికే వుంది.

కేవల ఉత్సాహం కొద్దీ చేసే భజన కాదిది. భక్తి తన్మయత్వంతో భగవంతుణ్ణి వేడుకుంటారు. అలా వేడుకుంటూ భక్తి పారవశ్యంలో అమితోత్సాహంలో చేసే నృత్యం చెక్కభజన. భజన చేసే వారే భక్తి భావంలో మునిగిపోవటం కాక, ప్రేక్షకుల్ని కూడా తన్మయత్వంలో ముంచేస్తారు. చెక్కభజన ప్రేక్షకుల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. ముఖ్యంగా పల్లెల్లో తీరిక సమయాలలోనూ వర్షాలు లేని రోజుల్లోనూ, పండుగ సమయాలలోనూ, దేవుళ్ళ కళ్యాణ సమయాలలోనూ, తిరునాళ్ళ సమయాలలోనూ రథోత్సవాలలోనూ, జాతర్లలోనూ ఈ చెక్కభజనల్ని చేస్తారు.

భక్తీ, ముక్తీ:

భక్తి కోసం ముక్తి కోసం ఈ భజనలు చేస్తారు. భజన బృందం కట్టుదిట్టంగా భజన చేయడం ప్రారంభించిన తరువాత ఉన్న ఊర్లోనే కాక చుట్టుప్రక్కల గ్రామాలకూ యాత్రా స్థలాలకూ బయలు దేరి వెళ్ళి తమ తమ ప్రావీణ్యాన్నంతా చూపిస్తారు. కేవలం పాటలతోనే గాక, రామాయణ భారత గాథల్ని ఘట్టాలు ఘట్టాలుగా ఆడుతూ,