పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/658

ఈ పుట ఆమోదించబడ్డది

బిట్రో నిట్రో అన్న దేవతల మీద కథ మనకు వివరంగా తెలియకపోయినా సంక్షిప్తంగా ఈ క్రింద వుదహరిస్తాను.

కథ:

బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి దేవిని వెంట బెట్టుకుని శైవ మతంలోని శివ భక్తుల్ని పరీక్షించడానికి భూలోకానికి వెళ్ళారట. అప్పుడు ఒక శైవుడు, తన భార్యను చీకటి తప్పు గావించిందన్న నెపంతో బాగా కొట్టి ఇంటి నుంచి వెల్లగొట్టాడట.

ఆమె వెంటనే తను చేసిన తప్పేమిటో తగిన నిదర్శనాలతో భర్త ఎదుట నిరూపించాలని, తద్వారా భర్త యొక్క మొప్పు పొందాలని దీర్ఘమైన పట్టుదలతో తల గొరిగించుకుని విభూతి రేఖలు, రుద్రాక్ష మూలికలు మెడనిండా ధరించి తెల్లని చీర గట్టి రామేశ్వరమునకు పరుగెత్తి పోయిందట. అక్కడుండే ఆళ్వారులు, లింగాయతులు, ముప్పాళ్ళ జోగుళ్ళు ఆమెను చూచి అస్యహించుకుని ఎగతాళి చేశారట. వెంటనే ఆమె రామేశ్వర దేవాలయంలో వున్న నంది వాహనంకు ఎదుట నిలబడి తన రెండు పాదాలపైన ఒక మట్టి కుండలో బియ్యం పోసి ఈశ్వరునికి నైవేద్యం వండటం ఆరంభించిందట. వెనువెంటనే అక్కడ ఆమె భర్త యైన శ్రీకంఠునికి తల తిరిగే రోగం ప్రారంభమవగా తన భార్యయైన ముక్తాక్షిని వెదుక్కుంటూ రామేశ్వరానికి ప్రయాణం చేసాడట. ఈ లోగా ముక్తాక్షికి బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి కన్నులెదుట సాక్షాత్కరించి తిరిగి యథావిధిగా నీ భర్తను త్రోవలోకి తీసుకుని పసుపు కుంకుమలతో ముత్తైదువుగా వుండి చిర కాలం బ్రత్రికిపోదువుగాక అని వరమిచ్చి పంపించారట. అప్పుడామె నిజ గ్రామమైన చోళపల్లికి వస్తుండగా మార్గమధ్యలో భర్తను కలుసుకోగా, ఆయనకు తలతిప్పే రోగ మటుమాయమైనదట. అంతట శ్రీకంఠుడు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళి సుఖంగా కాపురం సాగించారట. తెలుగుదేశంలో ఓరుగంటి కాకతీయుల కాలంలో వీర శైవమతం జోరుగా విజృభిస్తున్న

రోజుల్లో ఇలాంటి కట్టు కథలు ఎన్నో ఉద్భవించాయి. అలాంటి కోవకు చెందినదై యుండవచ్చు ఈ కథ. ఎవరికైనా బిడ్డలు లేక పోతే ఈ దేవతలను కొలిచేటట్లైతే సంతానం కలిగేదట.