పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/651

ఈ పుట ఆమోదించబడ్డది

ఏమి పుట్ట? పాము పుట్ట
ఏమి పాము? త్రాసు పాము

బాలిక లందరూ ఇలా పాడుతూ వుంటే బాలురు మరో గమ్మత్తు పాట పాడుతారు. చూడండి.

ఏమి త్రాచు? నల్లత్రాచు.
భూమికి తాళం వేస్తే - రంగా
భోగందానికి -సవరం దొరికె
సవరం బట్టుకెళ్ళి సాని కిస్తే
సాని నాకు జాబులు ఇస్తే
జాబులు పట్టు కెళ్ళి మామ కిస్తే
మామ నాకు పిల్లనిచ్చే
పిల్ల పేరు మల్లిమొగ్గ
నా పేరు జమీందార్.

ఇలాంటిదే మరొకటి.

కాకీ కాకీ కలవల కాకీ
కాకిని పట్టుకెళ్ళి గంగలో ముంచితే
గంగ నాకు గంధం ఇచ్చె
గంధం పట్టుకెళ్ళి - ఆవుకు రాస్తే
ఆవు నాకు పాలు ఇచ్చే
పాలు పట్టుకుని అమ్మకు ఇస్తే
అమ్మ నాకు జున్ను ఇచ్చే
జున్ను పట్టు కెళ్ళి - పంతులు కిస్తే
పంతులు నాకు పజ్జెం చెప్పె
పజ్జెం పట్తుకెళ్ళి మామకు ఇస్తే
మామ నాకు పిల్లనిచ్చే.
పిల్ల పేరు మల్లిమొగ్గ
నాపేరు జమీందార్.

అంటూ పిల్లలిలా కేరింతలు కొడుతూ, తద్దె పండుగలలో బృందాలు బృందలుగా చేరి ఆటల పాటలతో అందరినీ అలరిస్తారు.