పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/64

ఈ పుట ఆమోదించబడ్డది

కాకతీయుల కళా విన్యాసం

ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధి గాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు క్రీ.శ. 1050 మొదలు 1350 వరకు దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఆంధ్ర దేశ చరిత్రలో కాకతీయులు వర్థిల్లిన కాలం మహోజ్యలమైంది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీయ దండ యాత్రలకు ఎదురు నిల్చి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్రజాతికి ఒక కర్తవ్యాన్నీ, విశిష్టతనూ చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

1000 -1158 వరకూ కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకూ, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకూ సామంతులుగా వుండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడ ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది, 150 సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు పరిపాలించారు. వీరిలో చివరి వాడైన రెండవ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు.

మహోన్నత వీరులు:

తరువాత దశలో 1159- 1261 వరకు తెలంగాణాను పునాదిగా చేసుకుని ఆంధ్ర దేశాన్నంతా జయించారు. ఈ దశలో మొత్తం ముగ్గురు రాజులు పరిపాలించారు. వీరిలో ప్రసిద్ధులైన కాకతీయ గణపతి దేవుడు దీర్గ కాలం (1193 - 1262) వరకు పరిపాలించి కాకతీయ రాజ్యాన్ని విస్తరింప జేశాడు.

ఆ తరువాత దశలో 1262 నుండి 1323 వరకూ పరాయి రాజుల దండ యాత్రలనుండి కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన వారు రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి అనేక మంది సామంత రాజుల తిరుగుబాట్ల నోడించి సమర్థవంతంగా రాజ్య పాలన చేసింది. రెండవ రాజైన ప్రతాపరుద్రుడు అల్లావుద్దీన్ దండ యాత్రల్ని అనేక సార్లు త్రిప్పి కొట్టి చివరకు ఓడి పోయి బందీగా చిక్కి భరింప లేని కారాగార జీవితంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కాకతీయ చక్రవర్తుల లలితకళల్నీ, సారస్వతాన్నీ పోషించి వాటికి నూతన వికాసాన్ని కలిగించారు. వీరి కాలంలో నాట్య కళ బహుముఖాల విజృంభించి