కాశీ కథలు చెప్పే కాశీ కావడి
కాషాయ వస్త్రాలను ధరించిన వ్వక్తి కాశీ కావడి అంటూ ఒక కావడిని భుజాన వేసుకుని రెండు ప్రక్కలా పసుపు రంగు బట్టతో మూత గట్టిన బిందెలుగానీ రెండు బుట్టలుగానీ కావడి బద్దకు కట్టి, కావడిలో కాశీ విశ్వనాథుని విగ్రహాలను వుంచి పశుపు కుంకాలతోనూ, పుష్పాలతోనూ అలంకరించుతారు.
- బొమ్మల చిత్ర పటం:
ఆ కావడి కొమ్ముకు మూడు గజాల చిత్రపటాన్ని, ఒక ప్రక్క కావడి కొమ్ముకు తగిలించి, కాశీ విశ్వనాథుని సందర్శనాన్ని గురించి వారు ప్రయాణించే దీర్ఘ ప్రయాణంలో దర్శించే క్షేత్రాలను గురించీ, పూర్వ కాలంలో కాశీయాత్ర చేయాలంటే ఎంత కష్టమో ఈ కథ ద్వారా వినిపిస్తారు.
యాత్రికులు బయలు దేరిన దగ్గర నుంచీ, కాశీకి పోయే దారిలో, అడవుల్ని గిరించి, ప్రకృతి వర్ణన గురించీ, క్రూర మృగాల అర్భాటాలూ, నదీ ప్రవాహాలూ, సత్రాలూ, దొంగల దోపిళ్ళూ, మజిలీలూ, ఇతర యాత్రా స్థలాలూ, పర్వతాలలో ప్రయాణం, చివరికి కాశీవిశ్వనాథుని సందర్శనం. ఈ మధ్యలో వచ్చే బాధల్ని గురించీ, క్రూర మృగాల బారినుండి తప్పుకోవడం గురించీ, వరుస క్రమంలో కథను నడుపుతూ ఆ కథా సంవిధానంలో అన్ని రసాలనూ చిత్రిస్తూ, చివరికి అన్ని కష్టాలనూ అధిగమించి, కాశీ విశ్వేశ్వరాలయానికి చేరి ముక్తి పొందడంగా దీనిని జీవితానికి అన్వయించి, మనం స్వర్గానికి చేరుకోవడం ఎంత కష్టమో, ఈ కష్టాలను ఉదాహరణగా చెపుతారు. కథకుడు ద్విపద నడకలో కథను బహులబ్జుగా నడుపుతాడు.