పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/630

ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మరాజు గుళ్ళూ మహాభారత వీథి నాటకాలూ

భారత భాగవత కథలంటే చెవి కోసుకునే వాళ్ళు భారత దేశంలో కోకొల్లలుగా వున్నారు. కానీ, మహాభారతాన్ని ఒక "ఇన్నిస్టిట్యూషన్" లాగా రూపొందించడం ఆంధ్రప్రదేశంలో ఒక్క చిత్తూరు జిల్లాలోనే జరిగిందనీ, బహుశా దేశం మొత్తంలో ఇంకెక్కడా కూడా మహాభారతం ఇంతగా ప్రజల సాంస్కృతిక జీవనంలోకి చొచ్చుకు పోలేదేమోనంటూ పసుపులేటి పూర్ణచంద్రరావు గారు, ఆంధ్రజ్యోతి పత్రికలో వివరించారు.

ధర్మరాజు గుళ్ళు:

ధర్మరాజు గుళ్ళు పేరుతో చిత్తూరు జిల్లాలో నూరుకు పైగా ధర్మరాజు గుళ్ళున్నాయి. వీటిని గుళ్ళు ఆనటం కన్నా, సాంస్కృతి ప్రదర్శనా కేంద్రాలుగా పిలువవచ్చు. ప్రతి సంవత్సరం 12 నుంచి 18 రోజుల వరకూ మహాభారతం లోని పర్వాలన్నిటినీ వీథి నాటక రూపంలో ధర్మ రాజు గుళ్ళ ముందు ప్రదర్శిస్తారు. ఇలా చిత్తూరు జిల్లా అంతటా ఈ ప్రదర్సనాలు జరుగుతాయి. ఈ ప్రదర్శనాలను ఆసరాగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తరలివస్తారు. ఇలా తరలివచ్చే ప్రజలకు సదుపాయంగా వివిధారకాలైన అంగళ్ళూ, గ్రామీణ ఆట పాటలూ, వినోదాలు చోటు చేసుకుంటాయి. ఇలా ప్రతి గుడి ముందూ ఒక జాతరలాగా తయారౌతుంది. ముఖ్యంగా పని పాటలన్నీ అయిపోయిన తరువాత వేసవిలోనే ఈ కార్య క్రమాలు జరుగుతాయి. జాతరలూ, వీథి నాటకాలో, ఆధ్ర దేశంలో ఇతర చోట్ల ప్రదర్శింపబడినా, నూరు ప్రదర్శనాలకు పైగా ప్రదర్శింపబడటం చిత్తూరు జిల్లా విశేషం.

ఎన్నో వీథి నాటక బృందాలు:

మహాభారత కథకు చిత్తూరు జిల్లాలో ఎంత ఆదరణ వుందో, ఈ నాటికీ చిత్తూరు జిల్లాలో ఇంకా బ్రతికి వున్న వీథి నాటక బృందాల్ని చూస్తే తెలుస్తుంది.