పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/63

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకాకుళం జిల్లాలో వున్న మరో పెద్ద క్షేత్రం శ్రీకూర్మం. ఇది వైష్ణవ సాంప్రదాయానికి సంబందించిన క్షేత్రమైనప్పటికీ, నృత్యానికి సంబంధించిన భజన సంప్రదాయం ఇక్కడ ప్రచారంలో కొచ్చింది.

మాచెర్ల శైవ, వైష్ణవ సాంప్రదాయలకు పుట్టినిల్లు. రెండు మతాల వారూ చెన్నకేశ్వర దేవాలయం లోనూ, వీరభద్రేశ్వరాలయం లోనూ, వారి వారి సాంప్రదాయాల ననుసరించి నృత్య కళను కేళిక పద్ధతిలో ఆరాధించారు.

చెయ్యూరు నందికేశ్వరస్వామి దేవాలయం శైవ సంప్రదాయానికి సంబంధించినది. ఈ ఆలయంలో వాద్య విశేషాలతో ఆరాధన నృత్యాలు జరిగేవి. యక్షగాన పద్దతి ప్రదర్శనలు కూడ జరిగేవి. ఈ స్వామి పైన అనేక భక్తి రచనలున్నాయి.

జొన్నవాడ అంబ దేవస్థానంలో శైవ సాంప్రదాయాల ననుసరించి అంబను స్తుతిస్తూ నృత్య ప్రదర్శనాలు జరిగేవి.

కాళహస్తి దేవాలయంలో శైవ సాంప్రదాయ నృత్యాలు జరిగేవి.

మార్కాపురం వైష్ణవ దేవాలయంలో కేళిక పద్దతిలో ఆరాధన నృత్యాలు జరిగేవి

ఈ విధంగా ఆంధ్రదేశపు నాలుగు చెరుగులా అనేక దేవాలయాలున్నాయి. అన్ని ఆలయాలలోను, శైవ వైష్ణవ సాంప్రదాయాల ననుసరించి నాట్య శిల్పాలున్నాయి. వీటిని పరిశోధించటం ఎంతైనా అవసరం. ఇప్పటికే ఈ పరిశోధనలో పండిపోయిన నటరాజ రామకృష్ణగారు ఎంతైనా అభినందనీయులు.