నాట్య శిల్పాలు చెక్కబడి మనకు దర్శన మిస్తున్నాయి. ఒననాడు వుధృతంగా ఆంధ్రదేశంలో అభివృద్ధి పొందిన నాట్యకళకు సాక్ష్యాధారాలు ఈ శిల్పాలే. నాటి దేవాలయాలు హిందు సంస్కృతినీ లలితకళా సాంప్రదాయాలను చిత్రిస్తున్నాయి.
ఆనాడు దేవస్థాన నాటక రంగస్థలంలో దేవదాసీలు ఏయే భంగిమలో నృత్యాలను ప్రర్శించేవారో ఆ రూపాలన్నిటిని శిల్పులు సుందరంగా మలిచారు. ముఖ్యంగా దేవాలయాల్లో దేవదాసీల ఆరాధన నృత్యాలు జరిగేవి. దైవ సన్నిధిలో దైవాన్ని స్త్రోతం చేస్తూ నృత్య గానాలు జరిపేవారు. శైవ దేవాలయాల్లో శైవ సాంప్రదాయాన్నీ, వైష్ణవ దేవాలయాల్లో వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రదర్శించేవారు. దేవాలయ శిల్పంలో నృత్య కళ కిచ్చిన ప్రాముఖ్యాన్ని బట్టి లలిత కళా పోషణ ఆ నాడు ఎంతగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.
శ్రీశైల దేవస్థానంలో పూర్వం శృంగనాట్యం, సప్తలాస్యం ప్రదర్శించి నట్లు ఆలయ శిల్పాన్ని బట్టి పూర్వం శైవసాంప్రదాయ నృత్యాలు జరిగినట్లు తెలుస్తూ వుంది. భామాకలాపం, గొల్ల కలాప ఇతి వృత్తాలు శ్రీశైల భ్రమరాంబస్తవంతో ప్రదర్శింప బడేవి.
- దేవాలయాల్లో - దేవదాసీ నృత్యాలు:
ఇలాగే ఆంధ్రదేశంలో ఈ క్రింద వుదాహరించిన ఆ యా ప్రాంతాల్లో దేవాలయ నృత్య కళ అభివృద్ధి చెందింది.
పిఠాపురం, కుంతి మాధవుని దేవాలయంలో వైష్ణవ సాంప్రదాయ నృత్యాలైన భామాకలాపం, గొల్ల కలాపం ప్రదర్శింపబడేవి.
తిరుపతి వేంకటేశ్వర దేవస్థానం వైష్ణవ సాంప్రదాయానికి చెందినప్పటికీ, ఇక్కడ నృత్య విద్యావికాసం అంతగా కనిపించడం లేదు. కాని గాన పద్దతికి సంబంధించిన రచనలు మాత్రం కొల్లలుగా వున్నాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటేశ్వరుని పై రచించిన సంకీర్తనలు ఆ కోవకు చెందినవే.
శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణు దేవాలయంలో వైష్ణవ సాంప్రదాయంలో ఆరాధన నృత్యకళ అభివృద్ధి చెందింది.
బాపట్ల భావనారాయణస్వామి దేవస్థానంలో సిద్ధాబత్తుని వారు వైష్ణవ సంప్రదాయానుసారం శాస్త్రీయ నృత్య కళను రూపొందించారు.