పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/619

ఈ పుట ఆమోదించబడ్డది

ఆరెవారి గొంధళే వీధి భాగోతాలు


ఆంధ్రదేశంలో ఆంధ్రులకే తెలియని అరె జాతి వారనే ఒక ప్రత్యేకమైన తెగకు సంబంధించిన వారు, అనేక మంది తెలంగాణా జిల్లాలలో వున్నారనే విషయం చాల మందికి తెలియదనటం అతిశయోక్తి కాదు. వీరు ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలలో ఎక్కువ మంది నివశిస్తున్నారు.

గొంధళీలు తెలుగు దేశానికి ఎప్పుడు ఎలా వచ్చి స్థిరపడ్డారో చెప్పడానికి సరియైన చారిత్రక ఆధారాలు లేవు. కాని ఆరె వాళ్ళు వలస వచ్చిన తరువాతనో, లేక వారిని అనుసరిస్తూనో వినోద ప్రదర్శనాలు ఇవ్వడం కోసం వచ్చి, తెలంగాణాలో స్థిరపడి వుంటారని ఊహించవచ్చంటారు.

ఏది ఏమైనా ఈ గొంధళీలు కూడ మధ్య తెలంగాణా లోని ఆరె వాళ్ళ మాదిరి గానే, రాయలసీమ లోని సురభి వాళ్ళకన్న, అరె మరాఠీల కన్న ఆతి ప్రాచీనులని చెప్పవచ్చునని, డా॥ పేర్వారం జగన్నాథంగారు, వారు పరిశోధించిన ఆరె జానపద సాహిత్యం తెలుగు ప్రభావం అన్న గ్రంథం షష్ఠమ తరంగంలో వివరించారు.

కుండలాకార నృత్యం:

కుండలాకార నృత్య విశేషంగా చెప్పబడుతున్న గొండిలి, గొండ్లి, తోలు బొమ్మలాటల్లోని గాంధోళి గాడు గొంధళి, అనే పదాలన్నీ ఒకే కుదురు నుంచి పుట్టి వుండవచ్చునంటారు జగన్నాథంగారు. బుర్ర కథ, తోలు బొమ్మలాటల వంటి కళా రూపాలు కూడా మహారాష్ట్రనుండి తెలుగు దేశానికి వచ్చాయన్న ప్రతీతి కూడా వుంది.

ఆరె వాళ్ళు మహారాష్ట్ర నుండి తెలుగు దేశానికి వలస వచ్చి కొన్ని శతాబ్దాల క్రితమే స్థిరపడిపోయారు. తెలుగు ప్రజల జీవితాలతో వారు పెనవేసుకుపోయినా ఇప్పటికీ వారి భాషా సంస్కృతుల్నీ అచార వ్వవహారాల్నీ నిలుపుకొంటూ వస్తున్నారు.