పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/611

ఈ పుట ఆమోదించబడ్డది

రాగాలూ, తాళాలూ, నేటి కర్ణాటక సాంప్రదాయానికి చెందినవైనా, రాగ సంచారం, తాళ ప్రసారం మొదలైన విధానాలు ప్రాచీన సంప్రదాయ పద్ధతిని అనుసరించే వున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశపు కళారూపాలలో ఈ కళారూపంలోనూ అత్యంత ప్రాముఖ్యం వహించని మృదంగం ఈ తూర్పు వీధి భాగవతంలో అత్యధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా తూర్పు వీధి భాగవతానికి ఆయువు పట్టు మృదంగ విన్యాసమే.

మృదంగ ఘోషల్లో, ముత్యాల సరాలు:

తూర్పు వీధి భాగవత బాణీలో మృదంగం అధిక ప్రాముఖ్యాన్ని వహిస్తుంది. వారి వాయిద్య ఉధృత తాండవంగా వుంటుంది. ప్రేక్షకులను ఉత్తేజపరుస్తుంది. ఉద్వేగ పరుస్తుంది. మార్థంగికులు తమ వాయిద్యంలో సముద్రం ఘోషించి నట్లూ, పిడుగులు పడినట్లూ, ఉరుములు ఉరిమినట్లూ, మేఘాలు గర్జించి నట్లూ, భేరీలు , నగరాలు మ్రోగినట్లూ ప్రళయంగా వుంటుంది. ఆ దరువులను బట్టే నృత్యం కూడా అంత ఉద్వేగంగా వుంటుంది. వారి మృదంగ వాయిద్యంలో ఎంతటి గంభీర నాదాలుంటాయో, అంతటి సున్నితమైన, మృదుమధురమైన కోయిల స్వరాలూ, చిలుక పలుకులూ మొదలైన వాటిని మృదంగం మీద పలికిస్తూ ప్రేక్షకులను ఆనంద డోలికల్లో ముంచేస్తారు.

ఈ విశిష్ట వాయిద్యంలో నిష్ణాతులు బాజ్ఞాతి ఆస్థాన విద్వాంసులైన బుగత రామయ్యగారూ, ఆయ కుమారుడు గొప్పన్న గారు.

ఆ తరం తరువాత, కింతాడ అప్పన్న, ముట్నూరి సంగమేశ్వర శాస్త్రి, దూపం సూర్య లింగం, ఆగూరు కంచరాం, గ్రామ వాస్తవ్యులు, ప్రముఖ భాగవత శిఖామణి యైన దూడల శంకరయ్య గారి కుమారుడు, శ్రీ గోవిందరావు లాంటి వారు ప్రముఖులు.

ఈ బాణీలో సుప్రసిద్ధ మార్థంగికులు. అనేక బిరుదులు పొంది, అనేక మంది భాగవత మార్థంగికులను తయారు చేసిన ప్రఖ్యాతి అభినవ నందికేశ్వరునిగా పేరు తెచ్చుకున్న కీ॥శే॥ కోరు కొండ సత్యం గారికే దక్కుతుంది.