పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/588

ఈ పుట ఆమోదించబడ్డది

నేటికి షుమారు రెండువందలఏభై సంవత్సరాల క్రిందట ఈవిడ ఈ కథను గానం చేసేది. అచ్చెమ్మ గారు చనిపోయిన తరువాత...ఆమె దగ్గర కథ నేర్చుకున్న వెల్లగ్రామ నివాసి అయిన చిక్కాల కోటయ్య కాపు నేర్చుకుని వెల్లగ్రామానికి తీసుకు వచ్చాడు. కోటయ్య ద్వారా ఆయన కుమారులు పట్టాభి రామన్న, జానకి రామయ్యలు నేర్చుకున్నారు. వీరి ద్వారా మిగిలిన వారు ఈ కథాగానాల్ని నేర్చుకున్నారు.

కథకురాలు అచ్చమ్మ:

పూర్వం గొల్ల అచ్చమ్మ గారు తిరుపతి క్షేత్రం నడచి వెళ్ళేటప్పుడు ఈ కథను స్వంతంగా అల్లుకుని పాడుకుంటూ వెళ్ళేది. ఒక సారి ఆమెతో కూడ చిక్కాల కోటయ్య కూడ వెళ్ళడం జరిగింది కోటయ్యతో పాటు, పెద్దాపురం వాస్తవ్యులైన పెనుమాళ్ళ గోవిందు, గోడి సెట్టి నరసన్న మొదలైన వారు కలిసి వెళుతూ కథను ఆకళింపు చేసుకున్నారు.

తిరిగి వచ్చిన కొంత కాలం తరువాత గొల్ల అచ్చెమ్మగారి ఆవసానదశలో చిక్కాల కోటన్ను పిలిచి ... సంబరానికి సంబందించిన కోలలు... నెమలి కుచ్చు బెత్తము... తాళాలు మొదలైన సామానులిచ్చి, ఈ కథను ప్రచారం చేయవలసిందిగా కోరింది.

నాటినుంచి ఈనాటి వరకూ ఈ కథను గానం చేస్తున్నారు. వీరి ద్వారా వెల్ల గ్రామంలో చాల మంది ఈ కథను నేర్చుకుని కథా గానాన్ని చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు.

కోలసంబరం పేరెందుకొచ్చింది.

కోలసంబరం అనే వేంకటేశ్వర స్వామి కథ చాల వ్వాప్తి చెందింది. కోలలు వెలిగించి చెప్పేటటువంటి కథ కాబట్టి, దీనికి కోలసంబరం అని పేరు వచ్చింది. ఈ కోలసంబరం అనే ఈ కథా బృందంలొ ఆయిదుగురుంటారు. పైగా ఒక మనిషి కూడా వుంటాడు. ముందు భాగంలో ఇద్దరు కోలలు పట్టుకుంటారు. వెనుక నిలబడిన ఇద్దరూ కథకుడు పాడిన పాటకు వంత పాడుతూ వుంటారు. వెనుక వంత దారులు తాళాలు వాయిస్తూ వుంటారు. ముందు కోలలు పట్టుకున్న వారికి, వెనుక వంత పాడే వారికి మధ్య కథకుడు కథను చెపుతూ వుంటాడు. ఈ కథకుని గురువు అని పిలుస్తారు. ముందు భాగంలో నిలబడిన ఇరువురూ, హాస్యం చెపుతూ వుంటారు.