పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/586

ఈ పుట ఆమోదించబడ్డది
ఎందరో హరి దాసులు:

ఇలా ఒక్కరు కాదు. ఇద్దరు ముగ్గురు హరి దాసులు కూడ కోలాహలంగా పూరంతా వారి గానంతో ముంచెత్తుతారు. ఇలా వచ్చిన ప్రతి హరి దాసుకూ, భిక్షను అందచేస్తారు... ఇలా నెల రోజులుగా తిరిగి సంవత్సరానికి సరిపడ గ్రాసాన్ని సంపాదించుకుంటారు. వీరంతా బయట వూరినుంచే వస్తారు. వార్షికంగా ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో వారు తప్పా ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో విష్ణు భక్తులైన సాతానులు...దాసరులు, రాజులు మొదలైన వారు ఇలా జీవిస్తూ వుంటారు.

గ్రామవీథుల్లో హరిదాసులిలా హరిభజనచేయడం కోలాహలంగా వుంటుంది. హరి దాసుని అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి...బాల బాలికలు పోటీలు పడతారు. హరిదాసులిలా ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని, అయినా భక్తిభావంలో అదంతా మరిచిపోతారు.

హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వ దినాలలో, గంగి రెద్దులవారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి.

పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందర్నీ ఆదరిస్తారు.


కోనసీమ కోలసంబరం


తిరుపతి తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వారు సంతోషంగా దీపారాధన జరిపి కొందరు వేంకటేశ్వర ప్రసాదాన్నిచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మారి కొందరు ఈ కోల సంబరం కథను ఏర్పాటు చేస్తారు.

తెలుగు కళారూపాల్లో ఒక ప్రాంతంలో ప్రచారంలో వున్న కళారూపం మరో ప్రాంతంలో లేదు. ఒకో కళారూపం ఒక జిల్లాకే పరిమితమైన కళారూపాలు కూడా వున్నాయి. అలా చూసు కున్నప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఈ కోల సంబరం ప్రచారంలో వుంది.