పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/574

ఈ పుట ఆమోదించబడ్డది

ఆటగాళ్ళందరు కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో జట్టు నాయకుడు కొరడాను భుజాన వేసుకుని ప్రదర్శనలో క్రమశిక్షణను పాటించని వారికీ, తప్పు చేసిన వారికీ ఈ కొరడా పక్కలో బల్లెంగా వుంటుంది. ఒక్కొక్క సారి అందరినీ హెచ్చరించడానికి మధ్య మధ్యన చెళ్ళుమనిపిస్తాడు.

అలాగే కోలాట బృందం మధ్యలో వాయిద్య గాళ్ళుంటారు. వారు మద్దెలనూ, హార్మోనియం, తప్పెట, తాలు మొదలైన వాటిని హంగుగా ఉపయోగిస్తారు. అలాగే కోలాట బృందం ఉసెత్తుగా నృత్యం చేసే సమయంలో, బృంద నర్తకుల్ని ఉత్సాహ పర్చటం కోసం రంగుల గులామునూ, పూలనూ, గంధాన్నీ, పన్నీరునూ చల్లుతారు.

రాత్రి ప్రదర్శనం:

రాత్రి, పగలూ కోలాట ప్రదర్శనాలు జరుగుతూ వుంటాయి. ముఖ్యంగా రాత్రి ప్రదర్శనంలో గరిడి మధ్యలో ఒక పొడవైన కర్రను పాతి, పెట్రోమాక్సు లైటును పెడతారు. ఆ కాంతిలో బృందమంతా కనబడుతుంది. పూర్వం వెలుతురు కోసం కాగడాలనూ, ఆముదపు దీపాలనూ, కిరసనాయిలు పెద్ద బుడ్లునూ వాడే వారు. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో ఈ నాటికీ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఆటగాళ్ళ అలంకరణ:

సమసంఖ్యలో అందరూ, అన్ని త్రాళ్ళు పట్టుకుని గుండ్రంగా నిలుస్తారు. వీరు రెండు పక్షాలుగా చీలుతారు. రెండు పక్షాలకూ ఇద్దరు నాయకు లుంటారు.