పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/570

ఈ పుట ఆమోదించబడ్డది

కారంగా నిలబడతారు. ముందుగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. వారు ప్రదర్శన ఇచ్చే స్థలాన్ని గరిడీ అని పిలుస్తారు. వలయంగా నిలుచున్న కళాకారులు ఇద్దరు చొప్పున ఒకరి కొకరు ఎదురుగా నిలబడతారు. వారు పట్టుకున్న చిరుతలను లయబద్దంగా కొడతారు. వేగాన్ని పెంచడానికి జట్టు నాయకుడు ఇట్తయ్యకుడు దద్ధిమితా అనడంతో లయ, తాళం మారిపోయి వలయంలో వున్న వారు కొందరు లోపల వలయంగానూ, మిగిలినారు వెలుపలి వలయంగానూ మారుతారు.

ఆట మొదలు:

అప్పటితో ఆట ప్రారంభం అవుతుంది. ఇద్దరు ఇద్దరు కలిసి పట్టుకున్న పుల్లలను విడి విడిగా చేతుల్లోకి తీసుకుని కొట్టడంతో ఆట ప్రారంభమౌతుంది. అప్పుడు జట్టు నాయకుడు లయను సరి జేస్తాడు. కొన్ని ప్రాంతాలలో తాకా, తాకా, తాకా తాకా, తాకా తయ్యకు దిద్దిమి అని లయను సరిదిద్దుతాడు. మరి కొన్ని ప్రాంతాల్లో తకిటదిమిధిమిం, ధిమితధిమిధిం అంటూ ఎంత మంచి గురుడు దొరికేనే అనీ మరి కొన్ని ప్రాంతాలలో లాలి, లాలి, లాలి, లాలి__ లిలాయలో, లలిలాలి, లిలోయ్ లో లలీ, లాలి, ఎలాయ్ లో అని మరికిన్ని ప్రాంతాలలో కోలు, కోలు, కోలే, కొలన, కోలు, కోలోయ్, కోలు, కోలు, కోలే కోలన్న కోలు, కోలోయి అని లయను సరిదిద్ధుతారని వెంకటేశ్వర్లు గారు తమ జానపద విజ్ఞానంలో వివరించారు.

ఇలా లయను సరిదిద్దిన తరువాత ఒక పాటను ప్రారంభిస్తారు. ఆ పాటతో పాటే ఒక కోపును మొదలు పెడతారు. పాట పూర్తి అయిన తరువాత ఆ కోపులోనే సంవాద రూపంలో వున్న మరొక పాటతో ఉసెత్తుకుంటారు. ఉసెత్తు కోలాటం మారిన తరువాత ఆటను, పాటను ఇట్తయ్యకు తద్దిమిత్త అని జట్టు నాయకు డిచ్చిన ముక్తాయింపుతో నిలుపు చేసి తరువాత ఇంకో పాటను, ఇంకో కోపును ప్రారంభిస్తారు. ఇలా బాగా అలసిపోయే వరకూ కోపులు ఆడి, ఆ రోజుకు కోలాట ప్రక్రియను ముగిస్తారు. ఇదీ కోలాట మూల రూపం.

కోలాటానికి కొన్ని కావాలి:

కోలాట ప్రక్రియకు, జట్టు, జట్టు నాయకుడు, ఆటగాడు, గరిడి, ఉద్ది, కోపు, ఎత్తుగడ, ఉసెత్తు, ముక్తాయింపు, ఇంతే గాక కోలాట కర్రలు, గజ్జెలు, అందెలు, కొరడా, వాయిద్యాలు, వెలుగు సాధనాలు కోలాటానికి పనికి వచ్చే వస్తువులు.