పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/569

ఈ పుట ఆమోదించబడ్డది

కాని విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోలాటాలు ప్రసిద్ధంగా ప్రదర్శించినట్లు విదేశీ యాత్రికుడైన అబ్దుల్ రజాక్ వర్ణించిన విషయం తెలిసిందే.

ఈ నాటికీ విజయనగర శిథిల శిల్పాల గోడల మీదా, శ్రీశైలం దేవాలయ ప్రాకారపు గోడలపైనా కోలాటం వేసే నర్తకీ మణులు కోలాటపు శిల్పాలు చిత్రించబడివున్నాయి.

కోలాట నిర్వచనం:

కోలాట అనే శబ్దం కోల+ ఆట అనే రెండు దేశ్యాలయిన విశేషాల శబ్దాల కలయిక వల్ల ఏర్పడిందని, కోల అంటే కర్ర పుల్ల అని అర్థమనీ, కట్టియ, పుడక, కట్టె అనేవి పర్యాప పదాలనీ, ఆట శబ్దానికి తాండవం, నటనం, నృత్యం, నాట్యం, లాస్యం, నర్థనం, నృత్యం, క్రీడ విహారం అనేవి పర్యాయపదాలనీ.

కోలాటం అంటే పుల్లలతో నటనం, లేక నర్తనం, లేక తాండవం అని చెప్పవచ్చుననీ, అంటే రెండు చేతులతోనూ కర్ర ముక్కలు పట్టుకొని పదాలు పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతి కర్ర ముక్కను వేరొకరి చేతి కర్ర ముక్కలతో తాకించే ఒక ఆటనీ డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు వారి జానపద విజ్ఞానగ్రంథం 76 వ పేజీలో వివరించారు.

డా॥వేంకటేశ్వర్లు గారు కోలాట ప్రక్రియను చక్కగా పరిశోధించినవారు. వారి అభిప్రాయలనే ఇక్కడ పుదహరిస్తున్నాను. వారి కృషికి నా ధన్యవాదాలు.

రూపాంతరాలూ - పర్యాయ పదాలూ:

ఈ నాడు మనం కోలాటంగా చెప్పుకునే కళారూపానికి పర్యాయ పదాలూ, రూపాంతరాలూ, అనేకం వున్నాయి. కోలాట పదానికి హల్లీసకమనీ, ఉద్దితమనీ, కొట్టమూ, దండలాసకం, దండ నర్థనం అనే పర్యాయపదాలున్నాయి.

అలాగే కోలాట పదానికి, కోలాటలు, కోలు, కోలన్నలు, కొట్టమాట, కోలన్న అనేవి రూపాంతరాలు.

ఆడటం, పాడటం:

ఆటలో ఆసక్తి కలిగిన కొంత మంది ఆటగాళ్ళు బృంద నాయకుని అధీనంలో బృందంగా ఏర్పడి, కోలాట నృత్యాన్ని నిర్వహిస్తారు. ముందు అందరూ వలయా