- నన్నయ చెప్పిన నాటకానుభవాలు :
నన్నయ కాలానికే భానుడు, కాశిదాసు, శూద్రకకవి, శ్రీ హర్షుడు, భవభూతి, మొదలైన ప్రసిద్ధ నాటక కర్తల నాటకాలు వ్వాప్తిలో వున్నాయి. కాళిదాసుని శాకుంతలంతోనూ, భవభూతి ఉత్తర రామచరిత్రం తోను తనకు సంబంధ మున్నట్లు నన్నయ రచనల్లో కనబడుతూ వుంది.
నన్నయ కాలంలో నాటక ప్రదర్శనాలు జరుగుతూ వుండే ననడానికి ఉదాహరణగా, రాజరాజనరేంద్రుడు తనతో చెప్పినట్లు నన్నయ మహాభారతం అవతారికలో
చ॥విమలమతిన్ బురాణములు వింటి ననేకము, లర్థధర్మశా
స్త్రముల తెఱం గెఱింగితి, నుదాత్తరసాన్వి త కావ్వనాటక
క్రమములు పెక్కు సూచితి, జగత్పరి పూజ్యములైన ఈశ్వరా
గమములయందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితోన్.
అని ఉదహరించాడు. ఆ కాలంలో పురాణ పఠన శ్రవణం, శాస్త్రాలను గురిచి తెలుసు కోవడం, నాటకాలను చూడడం మెదలైనవి వున్నట్లే కాక , కన్నులారా నాటకాలను చూసినట్లు రాజరాజనరేంద్రుడు చెప్పడమే ఆ కాలంలో నాటకా లున్నాయనడానికి బలమైన నిదర్శనం.
తిక్కన సోమయాజి భారతం విరాట పర్వలో ఉత్తర నేర్చుకున్న విద్యల్ని వర్ణిస్తూ దండలాసకం, కుండలి, ప్రెక్కణం, ప్రేరణం మొదలైన నాట్య భేదాల్ని పేర్కొన్నాడు. విరాట ఉద్యోగ పర్వాలలో నాట్య,నాటకాల ప్రసక్తి కొల్లలుగా వున్నాయి. ఆనాడు తోలు బొమ్మలు ఆడినట్లూ భారతం విరాట పర్వంలో ( 3 -164) వివరించ బడింది.
- పిచ్చిగుంటులు చెప్పిన పల్నాటి వీర చరిత్ర:
వేంగీ చాళుక్యరాజుల పరిపాలన క్రీ.శ. 1100 తో అంతమైన తరువాత, చోళ, చాళుక్య మైత్రి ఫలితంగా రాజరాజనరేంద్రుని సంతతి వారు కాంచీ నగరంలో పరిపాలన ప్రారంభించారు.