పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/549

ఈ పుట ఆమోదించబడ్డది

చెక్కతో గాని చేయబడతాయి. రెండవది ఇత్తడితో తయారు చేస్తారు. రెంటి యొక్క శబ్దంలోనూ వైవిధ్యముంటుంది. కొయ్యతో చేయబడిన వీరణ శబ్దానికీ, ఇత్తడితో చేయబడిన శబ్దానికి వ్వతాసముండి, రెం‍డు శబ్దాల కలయిక,కథకు సరి జోడుగా వుంటుంది.

బొల్లావు:

ఎఱ్ఱగడ్డపాటి పోట్లాటలో పాల్గొన్న ఒంటి కొమ్ము బొల్లావు యొక్క బొమ్మ ఇది. దీనిని చెక్కతో గానీ, ఇత్తడితో గానీ తయారు చేస్తారు. తానకములు పాడునప్పుడు దీనిని నెత్తిపై పెట్టుకుని శివమెత్తినట్లు గంతులు వేస్తారు.

వీరద్రాడు:

వీరద్రాడు అంటే వీరత్రాడు. తిరుపతమ్మ దేవర పెట్టి ముందు దేవర పాత్ర ధారి తాడును ఝుళిపించటం మనకు తెలుసు. ఈ వీరద్రాడు పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు జరిపిన శివ నందుల కోట యుద్ధంలో యాదవు లతనికి తోడ్పడ్డారట. అందువల్ల యాదవులకు శివ నందుల కోటలో లభించిన గుడారు, వీర త్రాళ్ళు, గంగ, పోతురాజుల విగ్రహాలు బహూకరించారట. తానకాలు పాడేటప్పుడు, శివమెత్తి గంతులు వేసే వారు. వీర త్రాళ్ళతో కాళ్ళమీదా, చేతుల మీదా కొట్టుకుంటారు. ఈ వీర త్రాళ్ళు మూడు ముళ్ళతో వుండే బారిడేసి పగ్గాలు.

బసవ దేవుడు:

ఎఱ్ఱగడ్డపాటి పోరులో యాదవులు ఒరిగారనే వార్తను దొనకొండకు తెచ్చిన వాడు బసవదేవుడు. ఈ బసవదేవుని విగ్రహాన్ని కూడ గాధాకారులు దగ్గరుంచుకుని పూజిస్తారు.

కథకుల వేష ధారణ:

కాటమరాజు కథలను గానం చేసేటప్పుడు వీరణాలనే కాక, వారి శ్రుతి కొరకు తోలు తిత్తిని, లయకు తాళాలను ఉపయోగిస్తారు. ఇందులో ప్రధాన కథకుడు నిలువు టంగీ పన్నెండు మూరల తలపాగా, కాళ్ళకు గజ్జెలు, నడుముకు నడికట్టు, చేతిలో పిడి గుడ్డ మాత్రం వుంటాయి.