పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/500

ఈ పుట ఆమోదించబడ్డది

అందువల్ల దీనిని ఈటెల పండుగ అంటారని ఆంధ్ర ప్రభుత్వ గిరిజన సాంస్కృతిక సంస్థవారు (నాట్య కళ జానపద కళల సంచికలో ఉదహరించారు.)

చైత్ర మాసంలో గిరిజనులు చైత్ర పర్వం చేసు కుంటారు. అన్ని తెగల వారూ మహోత్సాహంతో ఉత్సవంలో పాల్గొంటారు. అందరూ ఒక చోట చేరి విందులు చేసు కుంటారు. యువతీ యువకులు ఒళ్ళు తెలియని ఆనందోత్సాహాలతో తెల్ల వార్లూ సంగీత నృత్యాలతో కాలక్షేపం చేస్తారు. అన్ని వయసులవారూ రోజుల తరబడి అడవులలో గడుపుతూ తృప్తిగా వేటాడతారు. వేట నుంచి రిక్త హస్తాలతో తిరిగి వచ్చేటప్పుడు, పురుషులను స్త్రీలు పరాభవిస్తారు. పర్వ దినాలలో ఒక గ్రామానికి చెందిన వారు మరొక గ్రామానికి వెళ్ళి, దింసా నృత్యంలో పాల్గొంటారు. పర్వ దినాలలోఒక గ్రామంవారు, మరో గ్రామం వారిని ఆహ్వానిస్తారు. అలా వచ్చే వారికి విందులు ఏర్పాటు చేస్తారు. ఇలా అందరూ కలిసి నృత్య వినోదాల్ని జరుపు కోవడాన్ని "నంకిడి కెల్చారు" లేక "కిందిరి కెల్చార్" అంటారు. చైత్ర పర్వం ఈ విధంగా వారి మద్య సఖ్యతును పెంపొందిస్తుంది.

దింసా నృత్యం:

అరకు లోయలో ప్రసిద్ధమైన నృత్యాలలో దింసా నృత్యం ఒకటి. వృద్ధులూ, యువకులూ, ధనికులూ, పేదలు అనే తేడా లేకుండా, అన్ని వర్గాల వారు దింసా నృత్య కార్య క్రమాలలో పాల్గొంటారు. కష్ట జీవు లైన గిరిజనులకు, ఈ కార్య క్రమాలు అంతులేని ఆనందాన్నిస్తాయి. దింసా నృత్యం అందరినీ అలరించడమే కాక, గ్రామీణ ప్రజల మధ్య సఖ్యతనూ, సుహృద్భావాన్ని పెంపొందిస్తుంది. దింసా నృత్యాన్ని చైత్ర పర్వం లోనూ, వివాహ సమయం లోనూ, పండుగ పర్వ దినాలలోనూ ప్రదర్శిస్తారు.

దింసా నృత్యంలో విలక్షణమైన, సంగీత వాయిదాలున్నాయి. "తుండి " , "మోరి","కిరిడి" "తుడుము" డప్పూ మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో లయ బద్ధంగా సాగుతుంది. ఈ నృత్యంలో కళాకారుల్ని ఉత్తేజ పర్చ టానికి మధ్య మధ్య ... జోడుకొమ్ము బూరలను ఊదుతారు. స్త్రీ పురుషు లందరూ సాంప్రదాయక మైన ఆభరణాలు ధరించి, రంగు రంగుల దుస్తులను అలంక రించుకుని నృత్యానికి హాజరౌతారు. దింసా నృత్యం ఎనిమిది రకాలున్నాయి.