పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/490

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీకాకుళం జిల్లాలో జాతపు దొరలు, సవరలూ మాత్రమే కొండ ప్రాంతాల్లో వున్నారు. కర్నూలు జిల్లాలోని నల్లమల అడవులలో నూ, మహబూబ్ నగర్ జిల్లాలోని అమరాబాద్ పీఠభూమి ప్రాంతంలో చెంచులు నివసిస్తున్నారు.

రాష్ట్రంలో అనేక చోట్ల కనిపించే జాతి బంజారులు, వీరినే సుగాలీలనీ, లంబాడీలనీ, లబానీలు అని కూడ పిసుస్తారు.

ఇక ఎరుకలు, ఏనాదులు మైదాన ప్రదేశాలలోనే నివాసాలు ఎర్పరుచుకున్న వారున్నారు.

గిరిజనులకు సంవత్సరం పొడుగునా వ్వవసాయమే జీవనాధారం. గోండులు, కోయలు, బగతలు, వాల్మీకులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని భూములను సేద్యం చేసుకుంటారు.

కొండ రెడ్లూ, కొండ దొరలూ, సామంతులూ సవరలూ నిలకడగా ఒక చోట కాక తమకు తోచిన ప్రదేశాలలో పోయి వ్వవసాయం చేసుకుంటారు.

ఇక కోయలు, బగతలు, వాల్మీకులు, కొలాములు, నాయక పోడులు, కోటియాలు, మూఖదొరలు మొదలైన గిరిజన జాతులు కూడ పోడు వ్వవసాయం ద్వారా, అదనపు ఆదాయాల కోసం ప్రయత్నిస్తారని డి.ఆర్. ప్రతాప్ గారు వ్రాశారు. అలా గిరిజనులు జీవిత విధానలను సాగించుకుంటూ ఆనందం కోసం, సంగీతాన్ని నృత్యాన్ని వాయిద్యాన్నీ జోడించి ఎన్నో కళా రూపాలను సృష్తించుకున్నారు.

గోండుల గుసాడి నృత్యం:

అదిలాబాదు జిల్లా రాజగోండులకు దీపావళి పెద్ద పండుగ. చలికాలం ప్రారంభమయ్యేసరికి పంటలన్నీ చేతికి వచ్చి వుంటాయి. తాము చెమటోద్చి చేసిన కష్టం, ధాన్యం లక్ష్మిగా నట్టింట చేరి వుంటుండి. గోడు లందరూ ఆట పాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభ మౌతాయి. రకరకాల వస్త్రాభరణాలు వేసుకుని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెడతారు. కొమ్ములూదుతూ, తప్పెట్లు వాయిస్తూ యాత్రలు సాగిస్తారు. గోండుల పురాణ గాథలలోని "దండారియారౌడ్, సిసిసెర్మారౌడ్" అనే కథా నాయకులను అనుసరిస్తూ ప్రతి సంవత్సరం నృత్యాలు చేస్తారు.

గోండు యువకులు 20 నుంచి 40 మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో గుసాడి నృత్యం ఒక భాగం. గుసాడి నృత్యంలో ఎందరో పాల్గొన వచ్చు.