పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/48

ఈ పుట ఆమోదించబడ్డది

వాద్యాలకు సంబంధించిన శిల్పాలు చెక్కబడినాయి. బౌద్ధ ఆరామాలన్నిటిలోనూ వివిధ లలితకళలూ పోషింపబడినాయి. ఇందుకు ఉదాహరణలు ఇటీవలి నాగార్జునుని కొండ త్రవ్వకాలలో అనేకం బయటపడి, భద్రపరచబడ్డాయి. ఆ కోవకు చెందినదే శిథిలమైన నాగార్జునుని కొండ ఆరుబయలు రంగస్థలం.

అన్ని హంగులతో ఆరుబయలు రంగస్థలం:

ఈ మధ్య నాగార్జునకొండ త్రవ్వకాలలో ఈ ఆరుబయలు రంగస్థలం బయట పడింది. ఇది దీర్ఘ చతురస్రప్రాంగణం గల స్టేడియం. దీనికి నాలుగు వైపులా ప్రేక్షకులు కూర్చోవడానికి వీలుగా ఇటుకలతొ మెట్లు మెట్లుగా రాతి పలకలు వరచిన ఆసనాల వరుసలు ఏర్పాటు చేసి వున్నాయి. ఇది 56.3 పొడవు 17.3 వెడల్పు వుంది. ఇది విద్యార్థులు సమావేశమయ్యే సభారంగం కావచ్చు. ఈ రంగస్థలంలో నైరుతి మూలగా ఎత్తైన శిలా వేదిక వుంది. ఇది ప్రధానవక్త నిమిత్తమూ, సంఘారామాన్ని దర్శించటానికి వచ్చిన వారి నిమిత్తమూ ఏర్పాటు చేయబడింది. ఇది ఆరుబయలు రంగ స్థలం. దీనిలో కురిసిన వర్షపు నీరంతా బయటికి పోవడానికి ఒక పెద్ద తూము వుంది. రంగస్థలం మధ్య భాగంలో ఒక గుండ్రని స్తంభం లాంటి వేదిక వుంది. వక్తలు దీని మీద నిలబడి సభికుల నుద్దేశించి ఉపన్యసించేవారట. ఈ రంగస్థలంలో వున్న ఒక చిచిత్రం దీని మధ్యనిలబడి వుపన్యసిస్తే ఆ కంఠధ్వని స్పష్టంగా రెండు వందల అడుగుల దూరం వరకూ వినబడుతుంది. అంతే కాక ఆసన పంక్తి అంతకంతకూ ఎత్తవుతూ వచ్చిన కొలదీ ఆధ్వని మరింత స్పష్టంగా వినబడుతుంది. దీనిని బట్టి అదివరకే ఆ పరిసర ప్రాంతాల నుండి వచ్చే ప్రతి శబ్ద ధ్వనుల ననుసరించి ఈ ఆరుబయలు రంగస్థలం నిర్మింపబడి యుండ వచ్చునని పి.ఎస్.ఆర్.అప్పారావు గారు వారి నాట్య శాస్త్రంలో ఉదహరించారు

అమరావతీ శిల్పాల అందచందాలు:

ఆంధ్రుల నృత్యకళ సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే శాతవాహనుల నాటికే అభివృద్ధి చెందిందనదానికి ఈనాడు అనేక ఆధారాలున్నాయి. అమరావతి, నాగార్జున కొండల్లో ఈనాడు కనిపించే అనేక పాలరాతి శిల్పాల్లో, అనేక నాట్య భంగిమలతో పాటు మన నాట్య సంప్రదాయాలన్నీ మలచబడి ఉన్నాయి.

ముఖ్యంగా అమరావతిలో దొరికిన శిల్పంలో ఒక బృంద నాట్య ముంది. బృందంలో ఉన్న ప్రతి నర్తకీ ఏదో ఒక భావాన్ని సూచిస్తూ వుంది. ఒక నర్తకి