పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/467

ఈ పుట ఆమోదించబడ్డది

గంగవెఱ్ఱి నెత్తించే గంగమ్మ జాతర్లు


ఆంధ్ర దేశంలో ఈ ప్రాంతానికి వెళ్ళినా, గంగానమ్మ, పోలేరమ్మ, మాచమ్మ, మరిడమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ మొదలైన ఎన్నో పేర్లతో ఈ జాతర్లు జరుగుతూ వుంటాయి. ఇది తరతరాలుగా జరుగుతున్న జాతర్లు. ప్రజలు ఎంతో మనశ్శాంతిని పొందుతూ వుంటారు.

అలా రాయలసీమలో కూడ ఏ మూల ప్రాంతానికి వెళ్ళినా కనిపించే దేవత గంగమ్మ అనీ, సాధారణంగా ప్రతీ గ్రామానికీ ఒక గంగమ్మ వుంటుందనీ, కొన్ని వూళ్ళకు ఇద్దరేసి గంగమ్మ లుంటారనీ, ఒకరు బ్రాహ్మణాది జాత్రర్లకూ, మరొకరు హరిజనులకు వుంటారనీ, అలాంటిది కాక ఒక్క, కాళాహస్తిలో మాత్రం ఏడుగురు గంగమ్మ లున్నారనీ ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు శాఖ రీసెర్చి స్కాలర్ మాదిరెడ్డి అండమ్మ గారు తెలుగు పత్రికలో వివరించారు.

జాతర నిర్ణయం:

గంగమ్మ జాతర జరపాలంటే పెద్దలందరూ సమావేశమై ఒక తేదీని నిర్ణయించి ఆ విషయాన్ని చాటింపు ద్వారా గ్రామ ప్రజలకు తెలియ చేసి గంగమ్మలను స్థాపించే మూడు రోజులు ముందుగా అంటే డిసెంబరు నెల రెండవ ఆదివారం అర్థ రాత్రిని 12 గంటలకు చాటింపు వేస్తారు. ఇది జరిగిన తరువాత ఆ వూరి వారు ఎక్కడ వున్నా జాతర సమయానికి చేరుకుంటారు.