ఈ పుట ఆమోదించబడ్డది
- గుఱ్ఱాల కదం:
ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఒకప్పుడు పెళ్ళి సందర్భాలలో, పెండ్లి కొడుకులు, నిజమైన గుఱ్ఱమెక్కి పెళ్ళి కూతురు వూరికి పెళ్ళిపెద్దలతో తరలి వెళ్ళేవారు, ఇలా వెళ్ళే సందర్భంలో దారిలో వున్న గ్రామాలలో డప్పులు వాయిద్యాలతో గుఱ్ఱాన్ని కదను త్రొక్కిస్తారు. డప్పు వాయిద్యానికి అనుగుణంగా కాళ్ళతో నృత్యం చేయిస్తారు. దీనిని కదం త్రొక్కించటం అనేవారు. అందు కోసం గుఱ్ఱాలను తయారు చేసి, వాటిని చక్కగా అలంకరించి, వాటికి నృత్యం నేర్పేవారు. ఈ గుఱ్ఱపు నృత్యాన్ని చూడడానికి గ్రామ ప్రజలు గుమి కూడి ఆసక్తితో చూసే వారు. చెప్పినట్లు చేసే ఈ గుఱ్ఱపు నృత్యం కనుల పండువుగా వుంటుంది.
ఈ గుఱ్ఱాల నృత్యాలను పెండ్లిండ్ల సమయాలలోనూ, కోటప్ప కొండ లాంటి తిరుణాళ్ళ సమయాల లోనూ సుందర గుఱ్ఱపు నృత్యాలు జరుగుతూ వుంటాయి.