పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/463

ఈ పుట ఆమోదించబడ్డది
జముకుల కథా రచనలు:

జముకుల కథల రచనా విధానం హరిహరీ పదాల వలె జంపె వరుసల్లోనే వుంటాయని తంగిరాల వారు జానపద ప్రత్యేక సంచికలో (నాట్యకళ) వివరించారు. తెలుగు సంప్రదాయ వీర గాధల్లో ఎల్లమ్మ కథలు (పరశురాముని కథలు) హరి హరీ పదాలను కూడ జముకులతో పాడటం కూడా జరుగుతూ వుంది. వీటి ననుసరించే ఆధునిక జముకుల కథలు బయలుదేరాయి.

అనేక బుర్రకథలు వ్రాసిన జాతీయ కవి భూషణ బిరుదాంకితులు, శ్రీ వారణాసి సత్యనారాయణ శాస్త్రి గారు జముకుల కథలను విశేషంగా రచించారు. 1947 నాటికే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే జముకుల కథని రచించారు. క్రీ॥శే॥ పుట్టా సుబ్బారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణాయపాలెంవారు ఈ కథను తమ దళంతో ప్రచారం చేశారు.

శాస్త్రిగారు రచించిన జముకుల కథలు ఇవి. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ అంతర్థాన గాధనూ, (1947 ) 1950 లో రాణీసంయుక్తనూ, 1950 లో ఆజామీళోపాఖ్యానం, 1951 లో భక్త ప్రహ్లద గాంధీజీ నిర్యాణం మొదలైనవి రచించారు. కానీ ఇవి అన్నీ అముద్రితాలుగానే వుండి పోయాయి.

జముకుల కథలలో పీసాలక్ష్మణ రావు కన్యక జముకుల కథ, ప్రజానాట్య మండలి దళమైన మిక్కిలి నేని, మాచినేని, ఉమామాహేశ్వరరావు గార్లు రేడియోలోనూ, ఆంధ్ర దేశమంతటాను విశేషంగా ప్రదర్శించారు. (మరోచోట వివరంగా వ్రాయబడింది) అలాగే శ్రీ ప్రయాగ నర్సింహశాస్త్రి గారు, నేతాజీ సుబాస్ చంద్ర బోసు వీర గాథనూ, మహాత్ముని జీవిత గాథనూ రచించారు. నేడు నూరి గంగాధరం గారు ఆంధ్రరాష్ట్ర ప్రబోధాన్ని రచించారు.

పౌరాణిక గాధలను ప్రచారం చేసిన జముకుల కథలనూ, హరిహరీ పదాలను, జాతీయ ప్రబోధానికీ, సాంఘిక ప్రయోజనానికి కూడ ప్రయోగించారు.