పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/462

ఈ పుట ఆమోదించబడ్డది

గారి వద్ద నేర్చుకుని దానిని ప్రజానాట్య మండలి ముఖ్య కళారూపంగా తీర్చి దిద్దారు. ఈ దళంలో కథకుడు మిక్కిలి నేని రాజకీయం, ఉమామహేశ్వర రావు హాస్యం, మాచినేని తరువాత కర్నాటి లక్ష్మీ నరసయ్య హాస్యం చెప్పారు.

రసవత్తరమైన ఈ కథ ఆంధ్ర దేశంలో 1944 - 1950 మధ్య ఆంధ్ర ప్రజలను ఉర్రూత లూగించింది. మద్రాసు రేడియోలో మూడు సార్లు, విజయవాడ రేడియోలో రెండు సార్లు, డిల్లీ రేడియోలో ఒకసారీ ప్రసారం చేయబడింది.

ప్రజానాట్య మండలి రాష్ట్ర దళంతో పాటు మద్రాసు, షోలాపూర్, పూనా, బొంబాయి, అహమదాబాదు మొదలైన రాష్ట్రేతర ప్రాంతాల్లో చెప్పబడి అధిక ప్రశంసలను అందుకుంది.

సుబ్బారావు పాణిగ్రాహి - జముకుల కథ:

ఈ జముకుల కథను శ్రీకాకుళం జిల్లా లోని ఏజన్సీ ప్రాంతంలో గిరిజనోత్సవం, భూస్వాముల దోపిడీకి వ్వతిరేకంగా సాగిన రోజుల్లో కామ్రేడ్స్ వెంపటావు సత్యం - అరికె సోములు, దుప్పల గోవింద రావులు ఆ వుద్యమాన్ని చిత్రిస్తూ తమకు చేతనైన పద్ధతుల్లో జముకుల కథగా చెప్పేవారు. దానిని వుత్తమంగా తీర్చి దిద్ది సుబ్బారావు పాణిగ్రాహి, నిమ్మల కృష్ణమూర్తి మొదలైన వారు శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి మద్దత్తుగా కథలు చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చేశారు. ఇది ఏనాటికీ వర్థిల్ల వలసిన వుత్తమ కళారూపం.

నూలు సూర్వారావు దళం:

పీసా లక్ష్మణరావు వ్రాసిన కన్యక జముకుల కథను మిక్కిలి నేని దళం రేడియోలోనూ ఆంధ్ర దేశంలో అనేక ప్రదేశాల్లో చెప్పేకథలు విని ప్రభావితులైన సామర్ల కోటకు చెందిన నూలు సూర్యారావు, గొంతంసెట్టి సూర్య నారాయణ, నూలు భాను మూర్తి మొదన వారు ఒక దళంగా "సారంగధర" కథను ఆరు వందల కథల దాకా చెప్పారు. రెండు వందల లవకుశ కథలనూ అలాగే కృష్ణ లీలలు, బకాసుర వధ - సీతా కళ్యాణం మొదలైన అనేక కథలను ఉత్తరాంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శనాలను ఇస్తున్నారు. పద్దెనిమిది పర్యాయాలు రేడియోలో జముకుల కథా కార్యక్రమాల నిచ్చారు. దాదాపు 25 సంవత్సరాలుగా ఈ బృందం వారు జముకుల కథల ప్రదర్శనాల నిస్తున్నారు.