పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/454

ఈ పుట ఆమోదించబడ్డది

జనం మెచ్చిన జముకుల కథలు


జముకుల కథలను జక్కుల కథలని పిలవడం కూడా కద్దు. ఈ కథలు కాకతీయుల కాలంలో బహుశ ప్రచారంలో వున్నట్లు ఎన్నో ఉదాహరణ లున్నాయి.

ఎల్లమ్మ కథ:

ఓరుగల్లులో ఆనాడు ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లమ్మనే రేణుక అని కూడ పిలిచేవారు. కాకతీయుల కాలంలో బవనీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చెపుతూ వుండేవారనీ, వారు ప్రయోగించే జవనిక..... జుకజుం, జుకజుం జుమ్మంటూ వీనుల విందుగా నాదం సాగేదనీ, క్రీడాభిరామంలో ఈ విధంగా ఉదహరింపబడి వుంది.

వాద్య వైఖరి కడు నెరవాది యనగ
ఏక వీరా దేవి ఎదుట నిల్చి
పరశురాముని కథ లెల్ల ప్రౌఢి పాడె
చాతుర కీర్తి బవనల చక్రవర్తి.