గద్దరించే పెద్దపులి నృత్యం
పులి వేషం శతాబ్దాలుగా ఆంధ్ర దేశంలో వర్థిల్లుతూన్న జానపద కళా రూపం. దీనినే వేట నృత్యమని కూడ పిలుస్తూ వుంటారు. హిందూ, ముస్లిం అనే మత వివక్షత లేకుండా, హిందువులు దసరా, సంక్రాంతి ఉత్సవాలలోనూ ముస్లిములు పీర్ల పండుగ, మొహరం సందర్భాల్లోనూ ఏదైనా ఆపద వచ్చినప్పుడూ లేదా జబ్బు చేసినప్పుడూ, పులి వేషం వేస్తామని పీర్లకు మొక్కుతూ వుంటారు మహమ్మదీయులు.
ఈనాడు పులి నృత్యాలు అంతగా ప్రచారంలో లేక పోయినా, ఒకప్పడు ఆంధ్రదేశంలో ప్రతి పల్లెలోనూ ఈ పులి నృత్యాలను చూసి వుంటారు.
- జంతు నృత్యాల అనుకరణ:
పులి వేషం జంతు నృత్యాలకు అనుకరణ, నెమలి నృత్యం, గరుడ నృత్యం, సింహ నృత్యం, అశ్వ నృత్యం మాదిరే ఈ పులి నృత్యం కూడా, పులి నృత్యాన్ని ఎక్కువగా ప్రచారం లోకి చెచ్చిన వారు పల్లె ప్రజలు.
దక్షిణ దేశంలో ఈ పులి వేషాన్ని, పులి వాలకోలు అనడం కద్దు. ఆంధ్రదేశంలో పులి వేషమనీ, పెద్ద పులి వేషమనీ, దసరా పులి వేషమనీ పిలుస్తూ వుంటారు. పులి వేషాల వారు వారి వారి నైపుణాన్ని వీథుల్లో ప్రదర్శించి ఆ తరువాత ఇంటింటికీ తిరిగి యాచిస్తూ వుంటారు. పిల్లలు, పెద్దలు భయపడేటంత సహజంగా పెద్ద పులి నృత్యంలో తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. పులి వేషం గ్రామంలో బయలు దేరిందంటే పిల్లలకీ, పెద్దలకీ అదొక పండగ.