పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/399

ఈ పుట ఆమోదించబడ్డది

గరిక అంటే కుండ అని అర్థం. ద్రౌపది తన వివాహ సమయంలో అనందావేశంతో ప్రక్క నున్న కలశాన్ని నెత్తిన పెట్టుకుని చిందులు వేసిందనీ, ఆ విధంగా అది పవిత్రం పొందిందనీ తెలుగు విశ్వద్యాలం జానపద కళల విభాగపు లెక్చరర్ డా॥బిట్టు వెంకటేశ్వర్లు గారు అంటున్నారు.

ఈ నాటికీ వివాహ సమయంలో అన్ని ప్రాంతాలలోనూ గరికెముంత, గరిగె బుడ్డి (అలంకరించిన) ముంత, పెండ్లి సమయాలలో కుమ్మరి వారు అలివేణి కుండలతో పాటు ఈ గరికె ముంతను కూడ అందంగా రంగులతో చిత్రిస్తారు. దీనిని ఎంతో పవిత్రంగా చూస్తారు. గరికె ముంత లేకుండా వివాహం జరపరు. ఆ ముంతతో పూజా విధాన ముగింపుతో దానిని తాకించి, మంత్రాలు చదువుతారు.

ఈ గరిక ముంత (బుడ్డి) ను పెండ్లికి ముందు రోజే కుమ్మరి ఇంటినుండి మేళ తాళాలతో వెళ్ళి కుమ్మరి వారికి కానుకలు చెల్లించి ఇంటికి తెచ్చి ఒక గదిలో వుంచి దీపారాధన చేసి పూజిస్తారు. ముందుగా ఈ గరిగెలను పూజించటం గౌరి పూజగా భావిస్తారు. అంటే పెండ్లిండ్లలో గరిగె గౌరీ మాతకు ప్రతీకగా పూజ నందుకుంటుంది. వివాహ సమయంలో గరిగెను దంపతుల ముందుంచి మళ్ళ పూజచేసి, వివాహాన్ని పూర్తి చేస్తారు. వివాహం జరిగినంత సేపూ గరిగె ముంత ఎంతో ప్రాముఖ్యం వహిస్తుంది. వధువు అత్త గారింటికి వెళ్ళే ముందు ఈ గరిగను వధువుతో పంపించి పెండ్లి తరువాత కూడ దానిని పవిత్రంగా సూస్తారు. గరిగ ముంతే గరగ గా మారిందంటారు.

బోనాలు:

ముఖ్యంగా క్షుద్ర దేవతలైన ముత్యాలమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, సత్తెమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైన దేవతలను, గరగల మాదిరే తెలంగాణా గ్రామాలలో బోనాలు పెడతారు. ముఖ్యంగా కుమ్మరి వారు, గొల్లవారు, ఈ బోనాల పూజకు గురువులుగా వుంటున్నారు. ఈ బోనాలనే రాయల సీమలో గరిగె బుడ్డి అనీ, సర్కారు ఆంధ్ర దేశంలో గరగలనీ, ఘటం కుండలనీ పిలుస్తారు.