పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/396

ఈ పుట ఆమోదించబడ్డది

గణాచార్ల గరగ నృత్యం


ప్రాచీన జానపద నృత్యాలలో ఒక ప్రత్యేక శైలిని సంతరించు కున్న నృత్య గరగ నృత్యం. ఇది పురాతన నాట్య కళ అనవచ్చును. దీని ప్రాముఖ్యం ఆంధ్ర దేశంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో హెచ్చుగా కనిపిస్తుంది. దీనినే ఘట నృత్యమని పిలవటం కూడ వాడుకలో వుంది. నెత్తిపైన కుండ వుంచుకుని ప్రారంభమయ్యే ఈ నృత్యం, నాగరికత కనుగుణంగా మలచ బడింది. ఈ గరగలనేవి లోహ నిర్మితమై, వాటిపై ఆదిశేషువు ఆదిగాగల చెక్కడపు బొమ్మలతో అలరారుతూ వుంటాయి. గరగ ఆకారం ఒక పూర్ణకుంభం మాదిరిగా వుంటుంది. ఈ గరగలను గ్రామ దేవతలని వివిధ పేర్లతో పిలువ బడే అమ్మవారి గుడులలో పదిలపర్చబడి అమ్మ వారితో పాటు పూజార్హమై, జాతర సమయాలలో నెలకు ముందు నుండే గర్భగుడి నుండి పైకి తీసుకవచ్చి ఆసాదు లనబడే వారు ధూప సేవతో నెత్తిపై పెట్టుకుని డప్పుల వాయిద్యంతో లయ భద్ధంగా నృత్యం చేస్తూ, అవేశ పూరితంగా కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమని మ్రోగు తుండగా అమ్మవారిని తన్మయత్వం చేస్తూ, చూపరులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ, తెల్ల వార్లూ ఈ నృత్య కార్య క్రమాన్ని అత్యంత నిష్టతో నిర్వహించటం ఒక విశేషం. ఆ తరువాత అమ్మవారి విగ్రహం దగ్గరకు గరగలను గర్భగుడికి చేర్చు తారు. మరికొన్ని చోట్ల ఈ గరగ నృత్యం చేసే ఆసాది వారి నిష్టకు నిదర్శనమా అన్నట్లు కణకణ మండే చింత నిప్పులపై నడుస్తూ నాట్యమాడటం కూడా గమనించవలసిన విశేషం. ఈ నిప్పుల గుండం త్రొక్కడ మనే ఆచారం మహమ్మదీయుల పీర్ల పండగలో కూడా మనం చూస్తూ వుంటాం.