ఏకపాత్రాభినయ గానం, హరికథాగానం
ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు వర్ధిల్లి ప్రజాభిమానాన్ని చూరగొన్న కళారూపాలలో ముఖ్యమైన హరికథా గానం ఆంధ్రుల హరికథా చరిత్రలో హరికథ ఒక ప్రత్యేకతనూ, గౌరవాన్నీ సంపాదించింది. దానిని ఒక విశిష్ట కళారూపంగా తీర్చి దిద్దిన వారు శ్రీమత్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు.
హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్ర ధారి మూడు గంటల కాలం కథా గానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితో నృత్యమూ చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయ మైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలో వున్న ప్రత్యేకత ఇదే. మూడు గంటల కాలం కూర్చున్నా ప్రేక్షకులకు విసుగు జనించ కుండా పిట్ట కథలతో, మధ్య మధ్య హాస్య రసాన్ని పోషిస్తూ సమాజంలో వున్న కుళ్ళు ఎత్తి చూపిస్తూ, వేదాంత బోధ చేస్తూ జనరంజకంగా హరి కథను గానం చేస్తాడు.
- వేషలు, భూషలు:
కథకుడు కేవలం అతని ప్రతిభవల్లనే ప్రేక్షకులను హరి కథతో రంజింప జేయగలడు. హరికథకుని వేషధారణ కూడ సామాన్యమే. చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు.