ప్రజల నుర్రూతలూగించిన జంగం కథలు, బుర్ర కథలు
ఆంధ్ర దేశంలో ఆనాటి నుండి ఈ నాటి వరకు బహుళ ప్రచారం పొందిన జంగం కథలు ఈ నాడు, బుర్ర కథలుగా పిలువబడుతున్నాయి. ఒకనాడు మత ప్రభోధానికి, దేశభక్తికీ ప్రతిబింబంగా నిలబడిన జంగంకథా కళారూపం రాను రాను యాచనకూ, వుదర పోషణకూ ఉపయోగ పడి తిరిగి ఈ నాడు దేశభక్తిని ప్రబోధిస్తూ, ప్రజా సమస్యలను చిత్రిస్తున్నది.
జంగం కథలను ఎక్కువగా జంగాలే చెప్పడం వల్ల వీటికి జంగం కథలనేపేరు వచ్చింది. ఈ కథలను సిరికి జంగాలూ, బుడిగె జంగాలూ, సెట్టి బలిజెలూ, సెట్టి ఫణిజెలూ, ఈత ముక్కు జంగాలూ, వంశ పారంపర్యంగా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. జంగాలందరూ శైవ భక్తులు కావడం వల్ల, శైవ వైష్ణవ మతాల మధ్య వచ్చిన సంఘర్షణ కాలంలో శైవమత ప్రచారానికి ఈ కథలను ఉపయోగించారు. వీర శైవమతం బాగా వ్వాప్తిలోకి వచ్చే నాటికి, అంటే క్రీ॥శ॥ 1150 నాటికే ఈ కథలను జంగాలు పాడుతూ వుండేవారు. వీరు ఈ కథలతో పాటు పగటివేషాలను కూడ ప్రదర్శించేవారు. బైచరాజు వేంకటనాథకవి, పంచతంత్రంలో .... కడివోని తెర నాటకపుటూరి జంగాలు అని వుదాహరించడాన్ని బట్టి, జంగాలు నాటకాలను కూడ ప్రదర్శించే వారని తెలుస్తూ వుంది.
దాసరు లందరూ వైష్ణవ భక్తులైనట్లే జంగా లందరూ శైవభక్తులు. వీరు చెప్పే కథలకు జంగం కథలని పేరు. వీరికే బుడిగె జంగాలనే పేరు కూడ వాడుకలో వుండి. అందుకు కారణం వారు కథలో ఉపయోగించే వాయిద్యానికి బుడిగె అనేపేరును బట్టి బుడిగె జంగాలనే పేరు సార్థక నామమైంది.ఈ బుడిగెనే డక్కీ అనీ, డిక్కీ అనీ, గుమ్మెటనీ అనేక రీతులలో ఆయా ప్రాంతాలలో ఉదహరిస్తునారు. బుడిగెలు మామూలు గుమ్మెట్ల కంటే చిన్నవి. ఇవి ఇత్తడితోనూ, కంచు తోనూ చేయబడి వుంటాయి.
జంగాలు ప్రారంబంలో శైవ కథలనే ప్రచారాం చేసే వారు. తరువాత శైవేతర కథలైన దేసింగు రాజు, విరాటపర్వం, భల్లాణ, సిరియాళ, దేవయాని, వామన