పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/315

ఈ పుట ఆమోదించబడ్డది

హారం త్రిపురాసుర సంహారం
ఈ నర్తకు లాడే బేరం
చూపుకైతే బహు దూరం
మేమున్నది కృష్ణాతీరం
మాది కూచిపూడి అగ్రహారం
మేము కులమున బ్రాహ్మణవారం
తమ మెడలో చంద్రహారం
ఆహార మిస్తే మీ భారం
దాశరథీ కరుణా పయోనిథీ.

అంటూ అది లౌకికంగా ఇంటి యజమానిని వూదర పెట్టి కానుకలు లాగేవారు.

ప్రసిద్ధులైన పగటి వేషధారులు


పసుమర్తి శేషయ్య:

పసుమర్తి శేషయ్యగారు భట్రాజు వేషం వేసి, నానార్థ రూపాలలో పద్యాలను చదివేవారు. ప్రేక్షకులు సూచించిన ప్రతి అక్షరానికీ పద్యం చెప్పేవారు. జక్కుల పురంద్రీ వేషం వేసి, బొబ్బిలి, మరాఠీ మొదలైన కథలను నేర్పుగా ప్రదర్శించేవారు. ఉపమానం లేకుండా ఏ విషయమూ చెప్పేవారు కాదు. ఇంకా బైరాగి వేషం __సోమయాజులు __సోమి దేవమ్మ వేషాలను రమ్యంగా ప్రదర్శిచేవారు. వీరిని శిరోమణి గారూ అని పిలుస్తూ వుండేవారు.

భాగవతుల కుమారస్వామి:

కుమారస్వామి గారు పఠానీ, సోమయాజులు, సోమిదేవమ్మ, కోమటి, అర్థనారీశ్వర మొదలైన ముప్పై రెండు వేషాలను సమర్థవంతంగా పోషించేవారు. వీరు మద్దెల వాయిద్యంలో ప్రసిద్దులు. నోటితోనె అద్భుతంగా మద్దెల వాయించే వారు. ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు కొన్ని ప్రదర్శించేవారు. కళాతపశ్వి యైన కుమారస్వామి గారు ఆజానుబాహుడు.