పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/288

ఈ పుట ఆమోదించబడ్డది
పాట


అమ్మసత్తెం చూడండీ, మల్లేలా, మల్లేలా
దేవి సత్తెం చూడండీ
సందుగొందులు తిరిగే తల్లి
సన్నపు కోకలు కట్టిందోయ్
మాయమ్మ, మాయమ్మ
ఎన్నో మాయల గల తల్లోయ్
మల్లేలా, మల్లేలా.

అంటూ నెత్తిన వున్న దేవర పెట్టెను క్రిందికి దింపి కుడిచేతిలో వీర భద్ర తాడును పట్టి ఫళ ఫళా అంటు నాదంచేస్తూ చూడండి బాబయ్యా, మా అమ్మోరు సత్తెం, అమ్మోరును ఎక్కడ నుండీ తీసుకు వచ్చాననుకున్నారు.

సీమకొండ, బెల్లంకొండ, నాగరాజకొండ, గోల్కొండ, కోరుకొండ, తిరుపతి కొండ, తిరుచునాపల్లి కొండ, తిరువాళూరు కొండ, ఆకొండ, ఈ కొండ అనేక కొండలు తిరిగి తీసుకువచ్చిన తల్లి బాబయ్యా, అమ్మోరు నామకారణాలు అనేకం వున్నై బాబయ్యా. కంచి కామాక్షమ్మ, గంటాలమ్మ, పెద్దింటమ్మ పోలేరమ్మ, నలజారమ్మ, నాంచారమ్మ, కలకత్తా మహాకాళి తల్లండి. అమ్మోరు సత్తెం మీలో వుంటది నాలో వుంటది, చెట్లో వుంటది, పుట్లో వుంటది, చేమల్లో వుంటది, దోమల్లో వుంటది. ఆండ పిండ బ్రహ్యాండలో ఆవరించి వుంది బాబయ్యా.

గజకర్ణ, కోకర్ణ
టక్కు టమాయీలు
గల తల్లె దిగుమఖతల్లె దిగుమఖ తల్లె.

బాబయ్యా ఇదిగోండి ఇది కుంకవండి. ఈ కుంకాన్ని అమ్మోరు సత్తెం వల్ల ఎర్రగా చేత్తాను బాబయ్యా అంటూ కొండలు మొదలుకుని దేవతల పేర్లూ, చెట్లూ పుట్టల పేర్లూ అన్ని గుక్క తిరగకుండా వల్లించి ఆ చేతిలో వున్న కుంకాన్ని రెండు చేతులకు మర్దించి అమ్మోరు సత్తెం వల్ల రక్తం అయింది చూడండి బాబయ్యా.

ఇది అమ్మోరు సత్తె మండి
ఇది పసుపండీ