పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/281

ఈ పుట ఆమోదించబడ్డది

అంతేగాక కళింగ గంగరాజు పగటి వేషాలవారి సహాయంతో శత్రువుల్ని జయించాడనే కథ కూడ వుంది.

కాకతీయ యుగంలో యుగంధర మహామంత్రి పిచ్చి యుగంధరుడుగా నటించి 'ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్' అంటూ ఢిల్లీ సుల్తానులను జయించింది పగటి వేషంతోనే.

పల్లావజ్ఝుల వారి ప్రతిభ:

ఇలా ఎన్ని వుదాహరణలనైనా మన చరిత్రల నుంచి తీసి చూడవచ్చు. కాని పగటివేషాల చరిత్ర మాత్రం మనకు సరిగా లభించడం లేదు. కాని రెండు మూడు వందల సంవత్సరాల క్రితం మైసూరు ప్రాంతం నుంచి పల్లావఝుల వెంకటరామయ్య అనే ఆయన వచ్చి రేపల్లెలో వుండిపోయి కొంత మందికి పగటి వేషాలు నేర్పి, ప్రదర్శించి, ఆంధ్ర ప్రజల మన్నన పొందారట. క్రమాను గతంగా ఆ పగటి వేషధారులకు, తరువాత, గడ్డి పాడు నివాసస్థానమైందని శ్రీనివాస చక్రవర్తి గారు తమ నాట్యకళ గ్రంథంలో వివరించారు.

గడ్డిపాడు పగటి వేషధారులు:

వీథి భాగవాలకు కూచిపూడి ఎలా కేంద్ర మైందో అలాగే పగటి వేషధారులకు గట్టిపాడు కేంద్రమైంది. కృష్ణా జిల్లాలో వీరంకి లాకుకు మైలు దూరంలో వున్న గడ్డిపాడు (హనుమంత రాయపురాగ్రహారం) ఈ భాగవతులకు కేంద్రం. గడ్డిపాడు భాగవతులుగా ప్రసిద్ధి నందినవారు పల్లావఝుల వారు__శ్రీకారం వారూ__ చూచివారు__కనువూరి వారు, బెల్లంకొండవారూ__బాపట్ల వారు__కవులవారు మొదలైన వారందరూ గడ్డిపాడు భావతులే. వీర్ఫందరికీ గురువు మైసూరు తెలుగు బ్రాహ్మణుడు. పల్లావఝుల వెంకటరామయ్య. వీరి ప్రతిభ ననుసరించి చూస్తే తెలుగు దేశంలో కంటే మైసూరులో(పగటి వేషాలు ఎక్కువగా వ్యాప్తిలో వున్నట్లు తెలుస్తూ వుందని శ్రీనివాస చక్రవర్తి గారు తమ నాట్యకళ గ్రంథంలో వివరించారు. రెండు శతాబ్దాలకు పూర్వం వచ్చిన పల్లావఝల వెంకట రామయ్యగారు ఆంధ్ర దేశంలో పగటి వేషాలతో సంచారం చేసి చివరకు రేపల్లెలో స్థిరపడి కృష్ణాజిల్లా గడ్డిపాటి వారికి ఈ విద్యను నేర్పి ఆర్యులైనారు.