బ్దతలను గురించి వివరంగా తెలిసి యున్న నర్తకుడు ఏ రూపాన్నైనా సృష్టించగలడని నాదృఢ విశ్వాసమంటారు రామకృష్ణగారు.
- శైవమత విజృంభణ:
కాకతీయ సామ్రాజ్యంలో శైవం, వీరశైవం విశృంఖలంగా విజృంభించింది.
ఆరోజుల్లో పశుపతి సాంప్రదాయం, వీరశైవం ముమ్మరంగా ప్రచారంలో వుంది. పశుపతులూ, మహేశులూ, వీర శైవులూ, మైలారదేవులూ, వీరందరూ శైవ మతాన్ని స్వీకరించినవారే. ప్రతి రోజూ వీరు ఆరుసార్లు శివుని నృత్యరీతుల్లో ప్రార్థనలు చేసేవారు. అందువల్లనే శైవ నృత్యాలు అత్యంత ప్రచారంలోకి వచ్చాయి.
శివాలయాల్లో పురుషులే నృత్యం చేసేవారు. దేవుని దర్బారని పిలువబడే కళ్యాణ మండపాలలో స్త్రీలు కేశిక నృత్యాలను చేసేవారు. దేవాలయాల్లో చేసేది సంప్రదాయ సిద్ధమైన నృత్యాలు. ఇవి అనేక తాళగతులకు చెందేవిగా వుంటాయి. తాండవంలో అభినయానికి అంతగా తావు లేదు. శివస్తోత్రానికి సంబంధించిన శ్లోకాలు మాత్రమే చదువ బడతాయి. ఇవి నృత్యరీతులకు అను గుణ్యంగా విండి నూట ఇరవై అయిదు విన్యాసాలతో విరాజిల్లు తుంటాయట.
కేశికి ప్రదర్శనంలో నృత్త నృత్య అభినతాలు వుంటాయి. ఇది నృత్యంతో ప్రారంభమై అభినయంతో ముగించబడుతుంది.
కాకతీయుల కాలంలో ఆరాధనా నృత్యాలు బహుళ ప్రచారంలో వుండేవి. ఇవన్నీ శివపరంగా, పశుపతి సంప్రదాయానికి అనువుగా వుండేవి. నాటి పశుపతులు, సంగీత నృత్యాలతో శివుని పూజించేవారు. అవి కాలానుగుణ్యంగా ఉదయమూ, మధ్యాహ్నమూ, రాత్రి సమయం లోనూ ప్రదర్శింపబడేవి. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా వున్న నాట్య వేదికలలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈ నాటికీ వరంగల్ కోట లోనూ, హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి ముఖమండపంలోనూ, పాలంపేట రామప్ప దేవాలయంలోనూ చూడవచ్చును.