పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/272

ఈ పుట ఆమోదించబడ్డది

జాయప నృత్త రత్నావళిలో వివరించిన నాట్య సాంప్రదాయానికి అనుగుణంగా శిల్పి రామప్ప, అత్యద్భుతంగా నాట్య శిల్పాలను మలిచారు. సజీవ కళ వుట్టి పడే ఆ నల్లరాతి నాట్య శిల్పాలు, శృంగార, వీరలాశ్యాలతో తొణికిసలాడుతున్నాయి. ముఖ్యంగా పురుష విగ్రహాలు, వీరసాన్ని వెల్లడిస్తూ వుంటే, స్త్రీ మూర్తులు లాస్యాన్ని ప్రతి బింబిస్తున్నాయి.

నృత్తరత్నావళిలో వివరించిన నాట్య రీతులన్నీ వాటి వైనా లేమిటో మనకు తెలియక పోయినా, ఈనాడు అవి ఆచరణలో లేక పోయినా, ఒక్క పేరిణి, నృత్యాన్ని వెలికి తీయడానికి, ఎంతో పరిశోధన చేసి, నటరాజ రామకృష్ణగారు దానిని ఉత్తమ నృత్య కళారూపంగా తీర్చి దిద్ది, ఈనాడు ఆంధ్ర దేశంలో బహుళ ప్రచారం లోకి తీసుకువచ్చారు.

పేరిణి ప్రశంస:

పేరిణి నృత్య సాంప్రదాయం శైవమతానికి సంబంధించింది. పేరిణికి సంబంధించిన ప్రస్తావన, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాథుని కాశీఖండం భీమఖండం లోనూ, వెంకటగిరి ప్రభువు, సర్వజ్ఞకుమార యాచేంద్ర రచన సభారంజని లోనూ, నందికేశ్వరుని భరతార్ణవం లోనూ వర్ణించబడింది.

పేరిణి వర్ణన

అన్ని నృత్యాలను గురించీ, నృత్తరత్నావళిలో వర్ణించినట్లే, పేరణిని గురించి కూడా జాయప ఈ క్రింది విధంగా వర్ణించాడు.

శ్లోకం

"రంజకో రూప సంపన్నః...
భావకో రసిక స్తాలవే దిగమక కోవిదః
ధ్వని శరీక సంపన్నో..."

అంటూ

సురేఖో వాద్యవిరీ ప్రేరణీ మతః.

అని వర్ణించాడు. ఈ వర్ణను బట్టే ఈనాడు రామకృష్ణగారు పేరిణికి ఒక రూపకల్పన చేశారనుకోవచ్చు.