పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/224

ఈ పుట ఆమోదించబడ్డది

కొంత కాలానికి యుక్త వయస్సు వచ్చింది. సంప్రదాయసిద్ధంగా ఆ గ్రామంలోనే అన్ని విధాల తగిన కన్యనిచ్చి వివాహం చేశారు. వివాహం అయిన కొద్ది దినాలకెల్లా సిద్దయ్యగారిలో ఒక కొత్త మార్పు రాసాగింది. విద్యాసక్తి కలిగింది. తల్లి దండ్రులవద్ద శెలవు తీసుకుని ప్రయాణమయ్యాడు. ఆ గ్రామానికి పశ్చిమంగా వున్న కృష్ణా నదిని దాటి విద్యాభ్యాసం కోసం పెళ్ళిపోయాడు. సిద్దయ్యలో కలిగిన ఈ వింత మార్పు గ్రామవాసులందర్నీ చకితులను గావించింది. కొంత కాలం ఇలా గడిచి పోయింది. సిద్దయ్యను గురించి చెప్పుకున్న వారు లేరు.

అన్ని విద్యలలోనూ ఆరితేరిన దిట్ట:

కాని ఇంతలోనే సిద్దయ్య గారు సకలవిద్యాపారంగతుడై అన్ని విద్యలలోనూ మరి ఇంతటివాడు లేడన్న పేరు తెచ్చుకొని తిరిగి వచ్చాడు.

వచ్చే ముందు సిద్దయ్యగారి గురువు, "నాయనా! నీవు నాదగ్గర అభ్యసించ వలసినదేమి యిక లేదు. పోయి గృహస్థాశ్రమ ధర్మం అనుసరించి సుఖంగా జీవించు" అని ఆశీర్వదించి పంపించాడు. గురువు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి ప్రయాణ మయ్యాడు సిద్దయ్య.

అది సంధ్యా సమయం. సూర్యుడు అరుణకాంతులు విరజిమ్ముతున్నాడు. సరిగ్గా ఆ వేళకు కృష్ణా తీరం చేరుకున్నాడు. సంజ చీకట్లు కమ్ముకుంటున్నాయి. సిద్దయ్య గారు స్నానంచేసి సాయంసంధ్యావందనం చేస్తున్నారు. ఇంతలో ఉన్నదున్నట్లు కృష్ణానది పొంగి నీటి ప్రవాహం ఒక్క పెట్టున ఆయన కంఠంవరకూ ముంచుకొచ్చింది. సిద్దయ్య ప్రమాద స్థితిలో పడ్డాడు. తన ప్రమాద స్థితి గమనించి ఆత్మసన్యాసం చేశాడట.

ఇంతలో ఒక తరంగం హఠాత్తుగా వచ్చి సిద్దప్పను చిత్ర్రంగా ఒడ్డుకు చేర్చిందట. అంతట ఆయన సంసారాన్ని త్యజించి తన శృంగార భావాలను శ్రీ కృష్ణభక్తితో మిళితం చేసి భామాకలాపమనే పారిజాతాపహరణ యక్షగానాన్ని రచించి కూచిపూడి భాగవతులకు బోధించి ధన్యుడైనాడని ఒక కథ.

ఆత్మసన్యాసం తరువాత కథ:

సిద్ధేంద్ర యోగి మొదట శృంగేరీ మఠంలో ఒక చదువు రాని మొద్దబ్బాయిగా వుండి ఊసుపోకకు