పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/221

ఈ పుట ఆమోదించబడ్డది

రిద్దరి మధ్య ప్రణయ కోపాలను తెప్పించటం., ఇరువురి మధ్య చేరి చమత్కార సంభాషణలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తూ, ధర్మాలను, నీతులనూ, బోధించడం చేస్తూ వుండే వాడు. అలాంటి విటుల వల్లనే ఆనాటి ప్రదర్శన సారాంశ ప్రేక్షకులకు చక్కగా అర్థమయ్యేది.

విదూషకుడు:

ఈతని పాత్ర కూడ హాస్యంతో కూడుకున్నదే. విరహంతో కూడుకున్న నాయకీ నాయకుల మధ్య వుండి వారిని నవ్విస్తూ సరియైన త్రోవలోకి తీసుకు రావడమే విదూషకుని కర్తవ్వం. అంతే కాక ఆనాటి ప్రజలకు అక్షర జ్ఞానం తక్కువ. ప్రదర్శనాకారుల భాష, ప్రదర్శన ఇతి వృత్తం, కఠినమైన భాషలో వుండటం వల్ల, వాటిని ప్రజలకు అర్థమయ్యే భాషలో తెనిగిస్తూ ఆయా పాత్రల మధ్య చేరి హాస్యాన్ని గుప్పిస్తూ వుంటాడు, ఈ విదూషకుడు.

కూర్మిని కూర్చే చేటకుడు:

సూత్రధారుడూ, విటుడూ, విదూషకుడూ, కాక ఈయన నాలుగవ వాడు. ప్రదర్శనాల్లో ఈతని పాత్ర, నాయికా నాయకుల మధ్య వచ్చే కలహాలను తీర్చడం, నాయిక చెప్పిన విషయాలను, నాయకునికి చెప్పడం, వీరిద్దరి మధ్యా రంగస్థలం పైనే వార్తలు మోస్తూ, ఏదో విధంగా వారిని సమాధానపరచి నేర్పుతో ఆకార్యాన్ని నిర్వహించేవాడు. ఇలా నిర్వహించిన తరువాత నాయికా నాయకుల ద్వారా పారితోషికం పొందేవాడు. ఈ దృశ్యమంతా ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించడం వల్ల, ప్రేక్షకులు ఎంతో ఆనందించేవారు. నిత్య జీవితంలో దంపతుల మధ్యా, ప్రేమికుల మధ్యా జరిగే సంఘటనలే గనుక ఇవి ప్రేక్షకుల నెంతో అనంద పరిచేవి.